13-09-2025 08:44:16 PM
ఐఐఐటి విద్యార్థులను పలకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఐఐఐటి కళాశాలలో వసతులు ఎలా ఉన్నాయి... ఏమైనా ఇబ్బందులు ఉంటే నిస్సందేహంగా చెప్పండి అంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పలకరించారు. శనివారం సాయంత్రం ఆకస్మికంగా ఐఐఐటి కళాశాలను సందర్శించి, హాస్టల్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎక్కడి నుంచి వచ్చారని, పదవ తరగతిలో మార్కులు ఎన్ని వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో భోజనం ఎలా ఉందని అడగగా, ఇంటి భోజనం మాదిరిగా ఉందని వారు చెప్పారు. లెక్చరర్స్ పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు? అర్థం అవుతుందా ? అని ఆయన అడిగారు.
లెక్చరర్స్ మంచిగా బోధిస్తున్నారని, పాఠ్యాంశాలు చాలా బాగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యేతో చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా, కలిసిమెలిసి ఉండాలని, మంచిగా చదువుకొని మహబూబ్ నగర్ ఐఐఐటి కళాశాల ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఐఐఐటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రవణ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు లీడర్ రఘు, యాదిరెడ్డి, రెడ్డి సేవా సంఘం సభ్యులు సురేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.