25-08-2025 02:47:10 PM
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి 50 లక్షలు వ్యయంతో లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి(Padma Vibhushan Dr. Nageshwar Reddy) ప్రారంభించగా, రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోనే గర్వించదగ్గ పద్మ విభూషణ్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభించడం సంతోషమని అన్నారు. నల్గొండ జిల్లాలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించేందుకుగాను గతం నుండి తాను కృషి చేస్తున్నానని, సంవత్సరంలోపే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించామని, 40 కోట్లతో నర్సింగ్ కళాశాలను సైతం కట్టిస్తున్నామని, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న చిన్న ఆపరేషన్లను ఇక్కడే నిర్వహించే విధంగా, పేదవారికి మేలు చేసేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కృషి చేయాలని, పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఏఐజి ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ శిక్షణ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిజిహెచ్ కు వెళ్లేందుకు గాను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. పద్మ విభూషణ్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభినందించారు. దీని ద్వారా పేద ప్రజలు వివిధ రకాల శస్త్ర చికిత్సలకు హైదరాబాదుకు వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నారు. తన తండ్రి ఆశయం మేరకు పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా, వైద్య విద్యార్థులకు శిక్షణ, పరిశోధన వంటి వాటిలో తాను కృషి చేస్తున్నానని, అందులో భాగంగానే ఏఐజి ఆసుపత్రిని స్థాపించడం జరిగిందని తెలిపారు.
జీవితంలో అందరికీ అవకాశాలు వస్తాయని, వాటిని అందిపుచ్చుకున్న వారే ముందుకు వెళ్తారని తెలిపారు. ఏఐజి అనేది ఆసుపత్రి మాత్రమే కాదని, ఇది పరిశోధనా కేంద్రం అని, ఇక్కడ ఇంటర్న్షిప్ తో పాటు, వివిధ రకాల పరిశోధనలు చేసే విద్యార్థులు సైతం ఉన్నారని చెప్పారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జి వి రావు మాట్లాడుతూ, నల్గొండ ప్రభుత్వ వైద్యు కళాశాల చాలా బాగుందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. దీనివల్ల ఎన్నో సర్జరీలు పెరిగే అవకాశం ఉందని, అంతేకాక నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, చారిటీ నిర్వాహకులు ఎస్పి రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్వోలు, డాక్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.