12-01-2026 12:49:19 AM
యువతలో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యం: అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి, జనవరి 11 : దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి విలువలను యువతలో పెంపొందించడమే మహనీయుల జయంతి కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు అన్నారు. దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219 వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు ముఖ్య అతిధి గా హాజరై ఒడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి ,ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న చేసిన పోరాటం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడిగా వడ్డే ఉబన్నను గుర్తు చేసుకున్నారు.
ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. బలహీనవర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి గురించి యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.భవిష్యత్ తరాలకు ఆయన జీవితం, చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, బీసీ సంఘం, రాష్ట్ర అధ్యక్షులుప్రభు గౌడు, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్, బి సి యూత్ అధ్యక్షులు గోరుగంటి రమేష్ కుమార్, కుమ్మరి సంఘం అధ్యక్షులు కుమ్మరి సాయిలు, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, వసతి గృహ సంక్షేమ అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.