30-12-2025 10:04:22 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలోని భక్తులు మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశిన(Vaikuntha Ekadashi Celebrations) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలకు తరలివచ్చి శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పండుగకు సంబంధించిన ముఖ్యమైన ఆచారమైన పవిత్ర ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరుచుకుంది. అర్చకులు ఉత్తర ద్వారం తెరిచి పుణ్యహవచనం, పూజలు నిర్వహించారు. పుణ్యహవచనంతో పాటు స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్రంమంత్రి రామ్మోహన్ నాయుడు, నటుడు చిరంజీవి, కుటుంబ సభ్యులు, నటుడు నారా రోహిత్ దంపతులు, సినీ నిర్మాత డీవీవీ దానయ్య, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, క్రికెటర్ తిలక్ వర్మ, సినీ నటుడు శివాజీతో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.