ఆర్‌ఓ ప్లాంట్లను పునరుద్ధరించిన వేదాంత పవర్
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్: సమాజ సంక్షేమం , గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటిచెబుతూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 1000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, లింగవరం , వరగల్లి అనే రెండు గ్రామాలలో 1,000 మందికి పైగా నివాసితులకు ప్రయోజనం చేకూర్చేలా రివర్స్ ఆస్మోసిస్ (ఆర్‌ఓ) తాగునీటి ప్లాంట్లను పునరుద్ధరించి, ఆధునీకరించింది.
పునరుద్ధరించిన సదుపాయాలతో ఈ రెండు గ్రామాలలో ఉన్న ప్రతి ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా దాదాపు 100 కుటుంబాలకు సురక్షితమైన మరియు స్వచ్ఛమైన తాగునీటిని అందించటం సాధ్యమవుతుంది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, సమాజంలోని ఒక కీలక అవసరాన్ని తీరుస్తుంది. ఎందుకంటే, ఈ రెండు ప్లాంట్లూ ఏడాదికి పైగా పనిచేయకపోవడంతో ఈ ప్రాంత వాసుల తాగునీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది.
మీనాక్షి ఎనర్జీ జోక్యం చేసుకోక ముందు, గ్రామస్థులు తమ రోజువారీ అవసరాల కోసం దూరంగా, అస్థిరంగా ఉండే నీటి వనరులపై ఆధారపడవలసి వచ్చేది. దీనివల్ల, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి, ప్లాంట్ల పనితీరును పునరుద్ధరించడానికి, వాటి దీర్ఘకాలిక విశ్వసనీయతను మెరుగుపరచడానికి కంపెనీ విస్తృతస్థాయిలో పునరుద్ధరణ పనులను చేపట్టింది.
ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో భాగంగా కార్యాచరణ సామర్థ్యం, విశ్వసనీయత, నీటి నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఫిల్టర్లు, మెంబ్రేన్లు, పంపుల మార్పిడితో పాటు కీలకమైన సివిల్ మరమ్మతులు, ఆటోమేటెడ్ వ్యవస్థల ఏర్పాటుతో సహా ఆర్ఓ ప్లాంట్లను మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ పునరుద్ధరించింది. ఈ నవీకరణల అనంతరం, ప్రజల వినియోగార్ధం ఈ సదుపాయాలను సంబంధిత పంచాయతీ పరిపాలనా యంత్రాంగాలకు అప్పగించారు.
ఈ కార్యక్రమం గురించి వేదాంత పవర్ సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు సురక్షితమైన తాగునీటి లభ్యత అత్యంత కీలకమనీ, ఈ తరహా కార్యక్రమాల ద్వారా తాము కార్యకలాపాలు సాగించే ప్రాంతాల్లో కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ తెలిపారు. నీరు, ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి వంటి రంగాలలో అర్థవంతమైన, స్థిరమైన సీఎస్ఆర్ కార్యక్రమాలను చేపట్టడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.






