02-08-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన జగదీప్ ధన్‌ఖడ్ (74) పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక తప్పనిసరయింది. ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నామి నేషన్లు వేసేందుకు ఆగస్టు 21వరకు అవకాశం కల్పించనున్నారు.
22న నామినేషన్ల పరిశీలన, ఎలక్టోరల్ కాలేజ్ తుది జాబితా, సెప్టెంబర్ 9న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించేలా ఈసీ కసరత్తులు చేస్తోంది. ఆరోగ్యపరమైన కారణాల తో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ పేర్కొన్నారు. 2027 ఆగస్టు వరకు ఆయన పదవీకాలం ఉండగా.. మధ్యలోనే అర్ధాంతరంగా రాజీనామా చేశా రు. ఆయన రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది.
ఎన్నిక విధానమిదే..
రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనుంది. ఎలక్టోరల్ కాలేజ్ అని పిలవ బడే రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఈ ఎన్నికలో ఓటు వేయనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 సభ్యుల మద్దతుంది. ప్రస్తుతం ఉభయసభల్లో మొత్తం 786 మంది ఉన్నారు. గెలిచేందుకు 394 మంది మద్దతు అవసరం. మరి ఎన్డీయే ఉపరాష్ట్రపతిగా ఎవరికి అవకాశం ఇవ్వనుందో.. ఎన్డీ యే తరఫున పలువురి నేతల పేర్లు ప్రముఖంగా ప్రచా రంలో ఉన్నాయి. జూలై 21న ధన్‌ఖడ్ తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.