30-09-2025 02:40:40 AM
హనుమకొండ, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సోమిడి బస్తీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సోమిడి శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో విజయ దశమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గంధసిరి ప్రసాద్, ప్రధాన వక్తగా వరంగల్ విభాగ్‌ఆర్ ఎస్ ఎస్ సంపర్క ప్రముఖ్ జూలపల్లి కరుణాకర్ పాల్గొన్నారు.
ప్రధాన వక్త కరుణాకర్ మాట్లాడుతూ సంఘటిత శక్తికి ప్రతీక విజయదశమి అన్నారు. వచ్చిన స్వాతంత్య్రాన్ని నిలుపుకోవడం కోసం దేశభక్తి, జాతీయత, సౌశీల్యం గల వ్యక్తులు దేశానికి అవసరమని డాక్టర్ హెడ్గేవార్ గుర్తించి, అటువంటి వ్యక్తుల నిర్మాణం కోసం 1925లో విజయదశమి రోజున నాగపూర్‌లో ఆర్.ఎస్.ఎస్‌ను స్తాపించార న్నారు. ఈ వ్యక్తి నిర్మాణం కోసం వారు సంఘ శాఖ అనే గంట కార్యక్రమాన్నీ ఇచ్చారన్నారు.
ఈ సంఘ శాఖ ద్వారా నిర్మాణమైన వ్యక్తులు అనేక మార్గాలలో దేశ అభివృద్ధికి పాటుపడు తున్నారని తెలిపారు. ఈరోజు ప్రపంచంలోనే సంఘం ఒక గొప్ప శక్తి గా ఎదిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదన్నారు. శాఖలో నిర్మితమైన స్వయం సేవకులు దేశానికి ఆపద సమయాల్లో ఆదుకునేందుకు ముందుంటారని తెలిపారు. ప్రస్తుత శతాబ్ది సంవత్సరం లో సంఘం భారతీయ కుటుంబ విలువలు కాపాడుకోవడం,
సమాజంలోని అన్ని వర్గాలు సోదర భావంతో మెలగడం, పర్యావరణాన్నీ పరిరక్షించడం, పౌరవిధులు పాటించడం మరియు స్వదేశీ జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ కాజీపేట నగర కార్యవాహ అలువాల రాజ్ కుమార్, సోమిడి బస్తి ప్రముఖ్ సుంచు పూర్ణచందర్ స్వయంసేవకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.