calender_icon.png 4 December, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన

04-12-2025 08:04:40 PM

భూంపల్లి పోలీస్ స్టేషన్లో 63 మందిపై కేసు

సిద్దిపేట క్రైం: సిద్దిపేట జిల్లా భూంపల్లి తాళ్లపల్లి గ్రామంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 63 మందిపై భూంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. తాళ్లపల్లి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి వద్ద ఈ నెల 3న కొందరు సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కులం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నీల ప్రభాకర్, గోపరి యాదగిరి, గోపరి కనకరాజు, గోపరి శ్రీకాంత్, వెల్పుల ఏసు అనే ఐదుగురు వ్యక్తులు నామినేషన్ దాఖలు చేశారు. వారిలో ఎవరైతే పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఇస్తారో, అతడికే అందరూ ఓటు వేయాలని పెద్దమనుషులు తీర్మానం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయమై భూంపల్లి ఎస్సై హరీష్ కు విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన సిబ్బందితో సమావేశం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా సమావేశం నిర్వహించడం, ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలనే అంశాన్ని చర్చించి, ఓటర్లను ప్రలోభానికి గురిచేయడం వంటి నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులతో సహా 63 మందిపై ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించేవారు ఇంతటి వారైనా ఉపేక్షించబోమని సిద్దిపేట అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.