14-12-2025 12:21:25 AM
మొదటి విడతలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుని రెండు, మూడో విడతలో మరిన్ని ఎక్కువగా పంచాయతీలను తమ ఖాతాల్లో వేసుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో సహా మిగతా పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సొంత గ్రామాలతో పాటు నియోజక వర్గాల్లో పార్టీలు బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి) : తెలంగాణలో పంచాయతీ పోరు రసవత్తంగా జరుగుతోంది. గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కంటే సర్పంచ్ ఎన్నికలే నువ్వా.. నేనా అన్నట్లుగా యుద్ధ వాతావరణంలో జరుగుతాయి. గ్రామాల్లోనే పట్టు నిలుపుకుంటేనే రాష్ట్రంలో అధికారం ఈజీగా దక్కుతుందని నాయకులు భావిస్తారు. అందుకు పల్లెల్లో పట్టు కోసం ప్రధా న పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
మొదటి విడతలో వచ్చిన ఫలితా లకంటే.. రెండు, మూడో విడతల్లో మ రింత పట్టు సాధించాలని రాజకీయ పార్టీల నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందుకు ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వం నుంచి స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ఆయా నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు మెజార్టీగా సర్పంచ్ స్థానాలను హస్తగతం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా మొదటి విడతకంటే మెరుగైన స్థానాలను సాధించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. కొన్ని చోట్ల సమాన ఓట్లతో డ్రా తీయడం వల్ల చేజారిన సీట్లు, మరికొన్నింటిలో పదుల సంఖ్య ఓట్ల తేడాతో ఓటమి చెందిన స్థానాల్లో ఇంకొంత గట్టిగా పని చేస్తే బయటపడేవాళ్లమనే చర్చ రాజకీయ పార్టీల్లో నడుస్తోంది.
పొరపాట్లు పునరావృతం కావొద్దని..
మొదటి విడతలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుని రెండు, మూడో విడతలో మరిన్ని ఎక్కువగా పంచాయతీలను తమ ఖాతాల్లో వేసుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో సహా మిగతా పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా తమ సొంత గ్రామాలతో పాటు నియోజక వర్గాల్లో అభ్యర్థుల విజ యం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రా మాల్లో ఓటు ఉండి హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తమకు ఓటేసేలా సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో ఆ యా పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు నిమగ్నమయ్యారు.
బీఆర్‌ఎస్ మాత్రం మొదటి విడత గ్రామాల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చామని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల్లోనూ ఉత్సా హంతో పని చేసి ఎక్కువ స్థానాలను ఖాతా లో వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక బీజేపీ మాత్రం స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువ సీట్లు రావడంపై అసంతృప్తితోనే ఉన్నారు. రెండో విడతలో ఎక్కువగా గెలిపించుకోవాలని తహతహతో ఉన్నారు.
అధికార పార్టీతోనే అభివృద్ధి అంటూ..
అధికార కాంగ్రెస్ ఈ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆధారపడి ప్రజల్లోకి వెళ్తోంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రధాన అస్త్రంగా మల్చుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే అదనంగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి మరింత స్పీడ్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూ పేద ప్రజలకు ఆకలిని తీరుస్తున్నామని ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
వీటితో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకు గ్యాస్ సిలిండర్‌తో పాటు 60వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు తదితర అంశాలను అధికార పార్టీ నేతలు వివరిస్తున్నారు. కాగా, మొదటి విడతలో 4,230 గ్రామాలకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఏకగ్రీవాలతో కలిపి 2,335 గ్రామాలను హస్తగతం చేసుకోగా, బీఆర్‌ఎస్ 1168 గ్రామాలు, బీజేపీ, 189, ఇతరులు 538 మంది గెలుపొందిన విషయం తెలిసిందే.