14-12-2025 12:01:35 AM
మిగిలింది 44 రోజులే..
మేడారం మాస్టర్ ప్లాన్ అట్టర్ ప్లాప్!
ఒడిదుడుకుల రహదారిపై రాకపోకలేలా?
జంపన్న వాగుపై మరో బ్రిడ్జి అవసరం
శాశ్వత పనుల నిర్వహణపై భక్తుల అసంతృప్తి
* ఆసియా ఖండంలోనే అతిపెద్ద జనజాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర. నూతన సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సమ్మక్క జాతరకు మిగిలింది ఇక ౪౪ రోజులు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం వద్ద అభివృద్ధి పేరుతో చేపట్టిన పనులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి.
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో ఈసారి కూడా జాతరలో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జాతరలో 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా శాశ్వతంగా వసతులతో గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి రూ.236.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధంచేసారు. 100 రోజుల గడువులో 50 రోజులకు పైగా కాలం ముగిసిపోయిన పనుల్లో ఆశించిన పురోగతి లేదు. ముందస్తుగానే ప్రతిరోజు జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలి వస్తుండడంతో గడువునాటికి జాతర అభివృద్ధి పనులు అంత సులభతరంగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు.
మహబూబాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): మేడారం జాతర నలువైపులా ఉన్న రహదారుల విస్తరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను భక్తులు సులభంగా దర్శించుకునేందుకు ఒకే వరుసలో స్థిరపరిచిన నిర్మాణాలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. గద్దెల వద్ద శాశ్వత రాతి ఫ్లోరింగ్, బారీకేడ్లు, దారి నిర్దేశిక బోర్డులు, వరస షెడ్లు, భక్తులకు ఇబ్బంది లేకుండా షెల్టర్లను ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్ లో రూపొందించారు. అయితే ఇప్పటివరకు గద్దెల ప్రాంగణాన్ని విస్తరించే పనులు కూడా ఒక రూపానికి రాలేదు.
రాతి శిలలతో ప్రస్తుతం గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెలు మాత్రమే కొంతమేర పను లు పూర్తిచేశారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల పనులు ఇంకా చేపట్టలేదు. రాతి శిలలను నిలపడంతోపాటు ప్రధాన ద్వారం, ఎగ్జిట్ దారులు వద్ద శిలల ఏర్పాటులో జాప్యం జరిగింది. ప్రాకారం పూర్తి కాకపోతే మేడా రం జాతరకు వచ్చే భక్తుల క్యూలైన్‌లను అనుసంధానించడం కష్టామే దీనివల్ల ఆల య ప్రాకారం పూర్తిగా భారీ రాతి శిలలతో నిర్మించాలనే లక్ష్యం ఆశించిన ప్రగతికి అడ్డు గా మారే పరిస్థితి ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయ ప్రాంగణానికి నలువైపులా ఉన్న రహదారులను నాలుగు వరుస లుగా విస్తరించి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే ఇప్పటివరకు ఒక వరుస మాత్రమే సిమెంటు రోడ్డు వేయగా మరో వరుస రోడ్డు పనులు ప్రారంభించలేదు. జంపన్న వాగు నుంచి జాతర ప్రాంగణం వరకు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే మిగిలింది. అలాగే తాడ్వా యి నుంచి మేడారం వరకు ఉన్న ప్రస్తుత రహదారికి కొన్నిచోట్ల మలుపులను విస్తరించే పనులు కొనసాగుతున్నాయి. మేడా రం జాతరకు ఇతర ప్రాంతాల రహదారులను కూడా విస్తరించి పనులు సాగుతు న్నాయి.
అతీగతీ లేని హైలెవల్ వంతెన
హనుమకొండ నుంచి మేడారం మార్గం లో ప్రస్తుతం కటాక్షపూర్ వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణం పనులు జాతర నాటికి పూర్తయ్య పరిస్థితి లేదు. అలాగే ఇరుకుగా మారిన మల్లంపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద కూడా పనులు ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఇక కొత్తగా ములుగు బస్టాండు నిర్మాణం, ఏటూరు నాగారం బస్సు డిపో పనులు కూడా జాతర నాటికి కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు.
ఒడిదుడుకుల రహదారిపై ఈసారి కూడా జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే జంపన్న వాగు పై మరో బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు వాహనాలను పూర్తిగా కన్నేపల్లి, నార్లాపూర్, ఊరట్టం వైపు పార్కింగ్ ఇస్తుండడంతో అక్కడినుంచి కాలినడకన భక్తులు మేడారం చేరుకుంటారు. ఇప్పుడు న్న రెండు వరుసల వంతెన భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కొత్త వంతె న నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.
ఊసేలేని తాగునీటి పనులు
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కొత్తగా తాగునీటి అవసరాలను తీర్చడానికి 20 నీటి ట్యాంకులు, నీటి శుద్ధి కోసం ఆర్వో ప్లాం ట్లను ఏర్పాటు చేయాలని తలచినప్పటికీ ఇప్పటివరకు ఆ పనుల ఊసే లేదు. 400 టాయిలెట్లను నిర్మించాలని ప్రతిపాదించినా ఇప్పుడిప్పుడే ఆ పనులు ప్రారంభించడంతో జాతర నాటికి అవి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. కొత్తగా అతిథి గృహాలు, బస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, పోలీసు పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు.
ప్రస్తుతం బస్టాండు పరిసరాలను శుభ్రం చేసి క్యూలైన్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. భక్తులు పవిత్ర స్నానం ఆచరించే జంపన్న వాగు వద్ద చెక్ డాం నిర్మా ణం, రక్షణ గోడలు, లైటింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం స్నానఘట్టాల పనులు, వాగులో అడ్డదిడ్డంగా ఉన్న ఇసుకను తొలగించే పనులు మాత్రమే జరుగుతున్నాయి.
పార్కింగ్ పనులు ఆగమాగం
1,050 ఎకరాల్లో పార్కింగ్ బస్సులు, కార్లు ఇతర ప్రైవేటు వాహనాలను నిలపడానికి ప్రత్యేకంగా పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాల్సిఉంది. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్లను విస్తరించి సిగ్నల్ సిస్టం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ చేయడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పలుచోట్ల వరి పంట కోత పనులు పూర్తి చేయకపోవడం తో పార్కింగ్ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు.
పనులు ఎక్కువ.. సమయం తక్కువ
భక్తుల అవసరాలకు సరిపడే విధంగా మేడారం జాతరను తీర్చిదిద్దడంతో పాటు గిరిజన సంప్రదాయాలు, ప్రకృతి వాతావరణం, భక్తుల రద్దీ మూడింటిని సమన్వ యంతో రూపొందించిన మాస్టర్ పనులు అతి తక్కువ గడువులో చేయాలని ఇప్పుడే పనులను ముందేసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
శాశ్వత ప్రాతిపదికన చేప ట్టే సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ విస్తరణ పనులు ఈ 2026 జాతరకు ముందు చేపట్టకుండా జాతర ముగిసిన తర్వాత 2028లో నిర్వహించే మళ్లీ వచ్చే జాతరకు రెండేళ్ల గడువు ఉన్న సమయం వరకు పను లు నిదానంగా నిర్వహించి పటిష్టంగా ఉండే లా చూస్తే బాగుండేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా తొలగించకపోవడం, ప్రకారం సిమెంట్ కాంక్రీట్ పనులు సాగుతుండడం, పాతవి తొలగించి కొత్తగా నిర్మించడం, ముందస్తుగా భక్తులు పెద్దఎత్తున జాతరకు ప్రతిరోజు తరలి వస్తుండడంతో గడువు నాటికి అంత సులభతరంగా మేడారం జాతర అభివృద్ధి పనులు పూర్త య్యే అవకాశాలు లేవంటున్నారు. దీనితో భక్తులకు ఈసారీ మేడారం జాతరకు వచ్చి వెళ్లడం కష్టతరమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆదిలోనే వివాదం..
మేడారం మాస్టర్ ప్లాన్ పనుల ప్రారంభంలోనే వివాదం ఏర్పడింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టకుండా, రోడ్లు భవనాల శాఖకు కట్టబెట్టడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనితో అప్పట్లో మంత్రుల మధ్య మేడారం అభివృద్ధి అంశంపై పీటముడి ఏర్పడింది.
అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడారం అభివృద్ధి పనులను పూర్తిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తారని ప్రకటించడంతో పనులు ముందుకు కదిలాయి. అయితే మేడారం అభివృద్ధి పనులను ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన వారికే కట్టబెట్టారనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మేడారం అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యవేక్షిస్తున్నారు.
ఆగమాగంగా శాశ్వత పనులు
200 ఏండ్లు నిలబడే విధంగా ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధికి చేపట్టిన శాశ్వత ప్రాతిపదికన పనులు, ఇంత తొందరగా చేపట్టాల్సిన పనిలేదు. ఈసారి జాతర ముగిసిన తర్వాత రెండేళ్ల గడువులో శాశ్వత పనులను నిదానంగా, పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. పాతవి తొలగించడం కొత్తవి నిర్మించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. జాతర సమయంలో వర్షం కురిస్తే, పనులు అసంపూర్తిగా ఇలాగే ఉంటే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది.
భక్తురాలు, పినపాక , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
త్వరితగతిన పూర్తిచేయాలి
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి, జాతర సందర్భంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం అధికారులను ఆదేశించారు.
సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను, జంపన్న వాగు వద్ద పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లలను ఆదేశించారు.