14-12-2025 12:00:00 AM
బోథ్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సోయా, మక్కలు కొనుగోలు చేయాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో శనివారం రైతులు రోడ్డెక్కారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మండలంలోని రైతులు పెద్దఎత్తున తరలివచ్చి బోథ్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.
రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సీఐ గురుస్వామి, ఎస్సై శ్రీసాయి, బోథ్ మార్కెట్ కమిటీ సెక్రటరీ విట్టల్ నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బోథ్ మార్కెట్ యార్డులో ఉన్న దాదాపు 10వేల క్వింటాళ్ల సోయాను వెం టనే కొనాలని డిమాండ్ చేశారు. పంటను ఎవరికి అమ్మాలో తెలియక ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు.
ప్రతి గింజను కొంటాం అని గొప్పలు పలికిన నాయకులు, అధికారులు.. అరకొరగా కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంటా చేసి, లోడ్ చేయించి పంపించిన సోయ పంటను సైతం రంగు మారాయని తిరిగి పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.