13-09-2025 03:18:15 AM
16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలూ నిరవధికంగా మూసివేస్తాం
టోకెన్లు జారీచేసిన రూ.1,200 కోట్లు నెలాఖరుకు విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక కాలేజీలను నడపలేకపోతున్నాం
ఉన్నత మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు తక్షణమే విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి కళాశాలలు నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఉన్నత విద్యా సంస్థల రాష్ట్ర సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని అసోసియేషన్ చైర్మన్ రమేశ్‌బాబు, కార్యదర్శులు కేఎస్ రవికుమార్, సునీల్‌కుమార్, కృష్ణారావు కలిసి వినతి పత్రం అందజేశారు. బకాయిలు విడుదల చేసేవరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్స్‌డేగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ రోజున బ్లాక్‌డేగా ప్రకటిస్తూ ఇంజినీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వృత్తి విద్యా కళాశాలు బంద్ నిర్వహిస్తాయని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 10 వేల కోట్ల వరకు ఉండగా, వాటిలో ఇప్పటికే రూ. 1,200 కోట్ల వరకు టోకెన్లు విడుదల చేశారని గుర్తుచేశారు.
ఈ నెల 30 వరకు వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేకపోతు న్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దనరా పండుగకు కూడా వేతనాలు ఇవ్వలేకపోతున్నందునే తప్పనిసరి పరిస్థితుల్లో తాము కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణ యించినట్టు వివరించారు. ఫీజు ఫండింగ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని యాజమాన్యాలు ప్రత్యేకంగా అభ్యర్థించాయని, అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదని, సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలే దన్నాని ఆవేదన వ్యక్తంచేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే..
డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా ఈ నెల 16 నుంచి నివరవధిక బంద్ పాటించనున్నట్టు ఆయా కాలేజీల అసోషియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, భవన యజమానులకు అద్దె కట్టలేక, అప్పులు ఇచ్చినవారికి వడ్డీలు కట్టలేక కళాశాలలు నిర్వహించలేని అనివార్య స్థితిలోకి ప్రభుత్వం నెట్టివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో కలిపి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.