calender_icon.png 28 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

28-11-2025 12:00:00 AM

  1. పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి 

నిజామాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మొదటి విడతలో బోధన్ డివిజన్ లోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని నవీపేట మండలం పరిధిలో గల 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని తెలిపారు.

రెండవ విడతలో నిజామాబాద్ డివిజన్ లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండతో పాటు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని జక్రాన్పల్లి మండలాల పరిధిలో గల 196 గ్రామ పంచాయతీలు, 1760 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మూడవ విడతలో ఆర్మూర్ డివిజన్ లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

పోలింగ్ నిర్వహణ కోసం మూడు డివిజన్లలో మొత్తం 5053 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే 28 మండలాలకు 5287 బ్యాలెట్ బాక్సులు పంపిణీ పూర్తి చేశామని, భీంగల్, డొంకేశ్వర్, నందిపేట మండలాలకు మొదటి విడత ఎన్నికలు ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులు పంపిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రి అన్ని ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, మరోమారు పునఃశ్చరణ చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

జిల్లాలో 3,96,778 మంది పురుష ఓటర్లు, 4,54,621 మంది మహిళా ఓటర్లు, ఇతర కేటగిరీలో 18 మంది మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటిచెప్పాలని సూచించారు. పోలింగ్ శాతం పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు సమాచార స్లిప్పులను బీ.ఎల్.ఓల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలింగ్ కు ముందు పంపిణీ చేస్తారని చెప్పారు.

జిల్లాలో 102 జోన్లను ఏర్పాటు చేస్తూ 111 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వెబ్ క్యాస్టింగ్ కు అవకాశం లేని పోలింగ్ సెంటర్లలో సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతుందని, 197 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని అన్నారు.

ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంచే నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు కూడా జిల్లాకు చేరుకోవడం జరిగిందని, ఎన్నికల నిర్వహణ తీరును అబ్జర్వర్లు నిశితంగా పరిశీలన జరుపుతారని అన్నారు.

ప్రలోభాలకు ఆస్కారం లేకుండా నిఘాను ముమ్మరం చేయించామని, ప్రతి మండలానికి ఎఫ్.ఎస్.టీ బృందాలతో పాటు, జిల్లాలో ఎస్.ఎస్.టీ నిఘా బృందాలను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కాగా, ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, అయితే ఎవరు కూడా ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించరాదని కలెక్టర్ సూచించారు.

అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుం న్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.