calender_icon.png 3 July, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్చువల్ విచారణలో బీరుతో న్యాయవాది

03-07-2025 01:43:35 AM

  1. గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  2. కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

వడోదర, జూలై 2: కోర్టులో విచారణ జరుగుతుండగా ఒక సీనియర్ న్యాయవాది ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. వర్చువల్ విచారణలో పాల్గొంటూ బీర్ తాగుతూ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించిన సీనియర్ న్యాయవాది భాస్కర్ తన్నాపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ ఘటన న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. గుజరాత్ హైకోర్టులో సీనియర్ కౌన్సిల్‌గా ఉన్న భాస్కర్ తన్నా.. జూన్ 25న జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ముందు జరుగుతున్న ఒక వర్చువల్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన మగ్గులో బీర్ తాగుతూ ఫోన్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ వీడియోనూ గమనించిన జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్‌టీ వచానిలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వెంటనే భాస్కర్ తన్నాపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.