calender_icon.png 1 August, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

31-07-2025 08:12:51 PM

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం నత్తనడకన సాగుతున్న జిల్లా కలెక్టరేట్ సముదాయపనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రారంభించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. గురువారం ఎంసీపీఐయు వరంగల్ జిల్లా ప్రతినిధి బృందం అజాoజాహి మిల్ గ్రౌండ్లో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించింది.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాల విభజన జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్న వరంగల్ జిల్లా ప్రజలకు జిల్లా కార్యాలయాలు సొంత జిల్లాలో లేకపోవడం ఎంతో అసౌకర్యాన్ని గురి చేస్తున్నదని, పరిపాలన సౌకర్యార్థం అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వరంగల్ జిల్లా ప్రజలకు మాత్రం ఒరిగింది శూన్యమని పైగా పక్క జిల్లా అయినా హన్మకొండ జిల్లాలోనే కలెక్టర్ కార్యాలయం ఇతర ఆఫీసులు ఉండడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం గానీ చిత్తశుద్ధి ప్రదర్శించడం జరగటం లేదని,  జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించి మూడు సంవత్సరాలు కావస్తున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయని పనుల్లో నాణ్యత లోపం కనబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రయోజనాలను అవసరాలను  గుర్తించకుండా స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లా ప్రజలను బలి పశువులను చేస్తున్నారని అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేస్తామని చెప్పిన పాలకులు అది విస్మరించి కనీసం జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం సకాలంలో పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు తక్షణమే పట్టించుకోని జిల్లా కేంద్ర కార్యాలయాలను త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా చర్యలు చేపట్టి క్షేత్రస్థాయిలో నాణ్యమైన పనులు జరిగే విధంగా అధికార యంత్రాంగాన్ని పురమాయించాలని డిమాండ్ చేశారు. ఎంతో చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లా నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని డిమాండ్ చేశారు.