24-07-2025 12:54:13 AM
స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్, జూలై 23 (విజయ క్రాంతి): ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ మెయిన్ కెనాల్ నుంచి పంట పొలాలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లు కొబ్బరి కాయ కొట్టి నీళ్లను విడుదల చేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ కింద పన్నెండు డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఒక లక్ష 6వేల ఎకరాల సాగుకు నీళ్లు అందనున్నట్లు తెలిపారు.
ఈ కెనాల్ ద్వారా ధర్మసాగర్, అయినవోలు, జాఫర్ గడ్, హసన్ పర్తి మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ’ఆన్ అండ్ ఆఫ్’ పద్ధతిలో రైతులకు నీళ్లు వస్తాయని వర్షాలు సమృద్ధిగా పడితే నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయని రైతులకు తెలిపారు. రైతులకు ఏకకాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
రైతులకు రైతు భరోసా, ప్రమాద బీమా, కౌలు రైతులకు 12 వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.