11-05-2025 02:11:43 AM
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- మంచుకండ ఎత్తిపోతల పథకం పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 10 (విజయక్రాంతి): మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరు విడుదల చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
శనివారం మంత్రి రఘునాథపాలెం మండలం గడ్డికుంట వద్ద గల గ్రావిటీ 5 కెనాల్, భవోజితండా వద్ద గల గ్రావిటీ 5 కెనాల్, భావోజీ తండా వద్ద రేగులకుంట చెరువును సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ద్వారా చెరువులకు నీటి విడుదల చేపడుతున్నామన్నారు.
రేగుల కుంట చెరువు నుంచి నీరు సర్‌ప్లస్ అయి నల్లకుంట చెరువు, మల్లెపల్లికెంట చేరుకుంటాయన్నారు. 3 రోజుల వ్యవధిలో మస్తానికుంట, మంచుకొండకు నీరు విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ ప్రాజెక్టుతో 2,400 పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీ నర్సింహారావు, నీటిపారుదల శాఖ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ ఉన్నారు.