calender_icon.png 11 May, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బడుల దోపిడీకి వేళాయె

11-05-2025 01:52:39 AM

  1. స్కూళ్లు ప్రారంభంకాకముందే పాఠ్యపుస్తకాలు అమ్మకం
  2. పుస్తకాల నుంచి షూస్ వరకూ.. జేబులకు చిల్లే!

హైదరాబాద్, మే10 (విజయక్రాంతి): ప్రైవేట్ స్కూళ్లు విద్యపేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నాయి. ఒకవైపు ఫీజుల పేరుతో తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తుంటే.. ఇది చాలదన్నట్లుగా మరోవైపు పుస్తకాలు, నోటుపుస్తకాలు, షూ, టై, బెల్టు, యూనిఫామ్ పేర్లతో దోపిడీ చేస్తున్నాయి. ఇంకా వేసవి సెలవు లు పూర్తి కానేలేదు.. పాఠశాలల జూన్ 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

అయితే ఇప్పటినుంచే నూతన విద్యాసంవత్సరానికి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్‌లను తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాలు కట్టబెడుతున్నా యి. తాము కొనం అన్నగానీ తమవద్దనే కొనుగోలుచేయాలని బలవంతంగా పేరెంట్స్‌తో కొనుగోలు చేయిస్తున్నారు.  చేసేదిలేక అక్కడే కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో నివాసముంటున్న జావేద్(పేరు మార్చాం) రామ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో  తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు.

పాప..ఒకటో తరగతి, బాబు ఐదో తరగతి చదువుతున్నారు. అయితే పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయాలంటూ జావేద్ మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం సూచించిన షాపుకు వెళ్లి తన ఇద్దరు పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేశారు. కేవలం ఒకటో తరగతి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలకు కలిపి రూ.3,865 అయితే, ఐదో తరగతి పుస్తకాలకు రూ. 4,642 ఖర్చయ్యాయి.

ఇది ఈ ఒక్క పాఠశాలలోనే కాదు. రాష్ర్టవ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు దాదాపు 12వేల వరకు ఉన్నాయి. ఇందులో నామమాత్రంగా ఫీజులుండే పాఠశాలలు 10వేల వరకు ఉంటే, రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఫీజులుండే పాఠశాలలు సుమారు 2వేల వరకు ఉంటాయి. అయితే వీటిల్లో పుస్తకాలు, యూనిఫామ్‌లకు ఫీజులు భారీగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికైతే తల్లిదండ్రులకు ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, తమ వద్దనే పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యాలు అంట గడుతున్నాయి. 

జూన్ వస్తుందంటే బాదుదే..

నూతన విద్యాసంవత్సరం వస్తుందంటేనే చాలూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు దోపిడీకి తెరలేపుతాయి. అంతా వ్యాపారమయంగా మారిపోతుంది. చిన్నపిల్లలు తినే వస్తువులు సహా వేటినీ విద్యాసంస్థల్లో విక్రయించొద్దని ఆదేశాలున్నాయి. కానీ, చాలా స్కూళ్లు తమ స్కూళ్లప్రాంగణాల్లోనే అమ్ముతూ పెద్దవ్యాపారమే కొనసాగిస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్, స్టేషనరీ, షూస్.. ఇలా అన్నీ బడుల్లో కొనాల్సిందేనని తల్లిదండ్రులకు తెగేసి చెప్తున్నాయి.

వీటిని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు మార్కెట్ రేట్ల కం టే 20శాతం నుంచి 80శాతం వరకు అమ్ముతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లో పుస్తకాలు అమ్మ కూడదని 2010లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవా ల్ చేస్తూ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు, స్టేషనరీ కోసం ఎక్కడెక్కడో తిరగకుండా తామే విక్రయిస్తున్నామని కోర్టు ముందు వాదనలు వినిపించాయి. దీన్నిసమర్థిస్తూ నోప్రాఫిట్ నోలాస్ పద్ధతిలో ఎలాంటి లాభాపేక్ష లేకుం డా విక్రయించాలని హైకోర్టు ఉత్తర్వులు జా రీ చేసినట్లు యాజమాన్యాలు చెబుతున్నా యి.

అయితే కొన్ని స్కూళ్లు లాభాపేక్ష లేకుం డా విక్రయిస్తుంటే, మరి కొన్ని స్కూళ్లేమో తమ ఇష్టానుసారంగా లాభాలను అర్జిస్తున్నాయి.ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూ డనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తనిఖీలు చే యాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులొచ్చిన ప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటూ మిగతా రోజుల్లో పట్టించుకో వడంలేదు. అధికారులకంతా ఇది తెలిసే జరుగుతోందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.