calender_icon.png 11 May, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల క్షేత్రం నదీఅగ్రహారం

11-05-2025 12:55:24 AM

కృష్ణమ్మ ఒడ్డు పలు ఆలయాలకు నిలయం. గద్వాల పట్టణానికి  ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తోంది. ఇక్కడ కృష్ణమ్మ పడమర దిక్కు నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. నదితీరాన గద్వాల సంస్థానాధీశుల కాలంలో బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారు. రానురాను కృష్ణా అగ్రహారంగా.. 

నేడు నది అగ్రహారంగా మారింది.

రామచంద్రుడు నడయాడిన పవిత్రస్థలంగా, లక్ష్మణుడు అలిగి వెళ్లిన చోటుగా, శక్తిమాత సంచరించిన ప్రదేశంగా.. కృష్ణవేణమ్మ స్వయంగా ప్రత్యేక్షమైన స్థలంగా.. నది అగ్రహారం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్ఫటిక లింగేశ్వర, శ్రీ ఆనందరాముల, సంతాన వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి ఆలయా లతో పాటు రామావధూత, అహోబిల, దత్తాత్రేయ, నవగ్రహ పీఠాలున్నాయి. 

లక్ష్మణుడు లేని సీతారాముల విగ్రహాలు..

శ్రీ సీతారాముల లక్ష్మణ సమేతంగా విగ్రహాలు కొలువు తీరి ఉండడం సహజంగా చూ స్తుంటాం. కాని లక్ష్మణుడు లేని సీతారాముల విగ్రహాలు మాత్రం ఒక్క నది అగ్రహారంలోనే భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇందుకు ఒక విశిష్టత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

వేట మార్గంలో సీతా రామ లక్ష్మణులు నది దాటుతూ ఈ ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. లక్ష్మణుడు శ్రీరామ చంద్రుడికి ఎదు రు మాట్లాడుతూ తాను విల్లును, బాణాలను మోసుకుని రాలేనని అలిగి నది అవతల వైపు కు వెళ్లిపోయారని నది దాటిన తరువాత తాను తన అన్న అయిన శ్రీరామచంద్రుడికి ఎదురు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోయి అం దుకు పశ్చత్తాపపడుతూ తన తప్పును మన్నించాలంటూ శ్రీరామ చంద్రుడిని వేడుకోగా ఇది నీ తప్పు కాదని ఈ స్థలంలో శక్తిమాత సంచరించడం వల్ల ఇలా జరిగిందని శ్రీరామ చంద్రుడు లక్ష్మణుడికి సెలవిచ్చారని అందుకు ఇక్కడ లక్ష్మణుడు లేని సీతారాముల విగ్రహాలు ఉన్నాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 

పాలి విగ్రహాలు.. 

నది అగ్రహారంలో గల ఆనంద భధ్రాధి సీతారామలు ఆలయాన్ని 12వ శతాబ్దంలో శ్రీ రామావధూత ఆధ్వర్యంలో నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

రామావధూ త ఇక్కడి చేరుకొని నదిలో శ్రీరామ చంద్రు డి పాదం చూసిన ఆయన ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని భావించి అక్కడే ఆశ్రమాన్ని ఏర్పా టు చేసుకుని నదిలో ఎర్రని రంగుబట్టపై కూర్చుని నిత్యం తపస్సు చేస్తున్న క్రమంలో శ్రీరామ చంద్రుడు ప్రత్యక్షమై విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పగా నదిలో నుండే లేచే సరికి అవధూత చేతిలో సీతారాముల పాలి విగ్రహాలు కనిపించాయి.

అప్పటి గద్వాల సంస్థానికి చెందిన రాజు అటుగా వెళ్తున్న క్రమంలో నీటిపై ఎర్ర  బట్టపై తప్ప స్సు చేస్తున్న అవధూత కనిపించగా ఎలా నీటిపై తపస్సు చేస్తున్నారని రాజు అవధూతను ప్రశ్నించాడు. అందుకు ఎర్ర బట్టపై వెళ్లి వస్తానని చెప్పగా రాజు నమ్మకపొవడంతో రాజును తీసుకుని అవధూత ఎర్ర బట్టపై కూర్చొబెట్టుకుని తాను నిత్యం తప స్సు చేసే ప్రాంతానికి తీసుకుని వెళ్లగా ఆశ్చర్యపోయిన రాజు తన చేతికి గల కంకణాన్ని అవధూతకు బహుకరించారు.

రాజు బహుకరించిన కంకణాన్ని అవధూత ధరించ కుండా నదిలో పడేడంతో ఎందుకు ఇలా చే శావని రాజు అవధూతను ప్రశ్నించగా తాను పడేయలేదని కృష్ణవేణమ్మకు ఇచ్చానని సమాధానం చెప్పారట. గంగా భగీరథ ఉత్సవాలు జరిపిస్తే కృష్ణవేణమ్మ నుంచి కంకణా న్ని తెప్పిస్తానని అవధూత రాజుకు తెలపడంతో అందుకు రాజు ఒప్పుకుని గంగా భగీ రథ ఉత్సవాలను జరిపించడంతో కృష్ణవేణమ్మ నదిలో నుండి తన రెండు చేతులను బయటకు తెస్తూ కంకణాన్ని తిరిగి ఇచ్చిందని.. ఇదే క్రమంలో రాజు సహకారంతో అవధూతన రామాలయాన్ని నిర్మించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. 

నాగశేషులకు సైతం అభిషేకం

ఆలయాల్లో ఏర్పాటు చేసిన దేవత విగ్రహాలకు, మూల విరాట్‌లకు అభిషేకం చేస్తుంటారు. కాని నది అగ్రహారంలో మాత్రం సీతారాముల విగ్రహాలకు అభిషేకం చేసిన నీళ్లు ఆంజనేయ స్వామి, నాగశేషుల విగ్రహాలకు సైతం ఒకేసారి అభిషేకం చేయడం ప్రత్యేకత. సీతారాముల ఆలయం రెండవ అంతస్థులో ఉండగా కింది అంతస్థులో ఆంజనేయస్వామి, ఆ కింది అంతస్థులో నాగశేషుల విగ్రహాలకు అభిషేకం చేస్తారు. 

కాశీ స్పటికలింగ విశిష్టత..

నది ఒడ్డున కాశీ స్పటిక లింగేశ్వర స్వామి ఆలయం కలదు. గద్వాల మహారాణి అయిన ఆదిలక్ష్మీ దేవమ్మకు సంతానం లేకపోవడంతో పండితుల సూచన మేరకు కాశీ నుండి స్పటిక లింగాన్ని తెప్పించి ఆ లింగానికి 1,016 బిందెల పాలతో అభిషేకం చేసి శివలింగాన్ని తాకితే సంతానం కలుగుతుందని చెప్పగా పండితులు సూచించిన విధంగా చేయడంతో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మకు ఇద్దరు కుమార్తెలు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి.