11-05-2025 01:16:17 AM
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): వైద్యరంగంలో కేరళ అద్భుతాలు సృష్టిస్తోం ది. అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని ఇటీవల తెలంగాణ వైద్యాధికారులు ఆ రాష్ట్రంలో జరిపిన అధ్యయ నంలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేరళ మోడల్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టి ఇక్కడ కూడా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని భావిస్తోంది. అలాగే ఆసుపత్రులు, వాటి సేవలపై బ్రాండింగ్ చేస్తూ ప్రజల్లో సర్కారీ వైద్యంపై నమ్మకం కలిగేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రభుత్వం కేరళలో చేసిన అధ్యయ నంలోని కీలకమైన అంశాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల బ్రాండింగ్, పనితీరు రెండింటినీ మెరుగుపరిచి రోగులకు చక్కని వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్షలు సైతం నిర్వహించారు.
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న రాష్ర్టస్థాయి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) సెమినార్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్య సేవల విభాగాధిపతులు, కార్యక్రమ సమన్వయకర్తలు, అధికారులు, సిబ్బంది సుమారు 5 వేల మంది పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవలతో పాటు ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా, మెరుగైన సేవలు అందించేలా బ్రాండింగ్‌ను తీర్చిదిద్దేలా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ వైద్యాధికారి ఒకరు వెల్లడిం చారు. కేరళ స్టడీస్‌పై ఈ కార్యక్రమంలో వైద్యాధికారులతో చర్చించన్నారు.
కేరళలో చక్కని వైద్య సేవలు..
కేరళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలపై ఇటీవల అధ్యయనం చేసిన తెలంగాణ వైద్యాధికారుల బృందం, 38 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇం దులో కేరళలో పేషెంట్ ఫస్ట్ విధానంలో రోగులకు వైద్యసేవలు అందించడంపై ప్రత్యే క దృష్టిసారిస్తున్నట్టు గుర్తించారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన సేవలు, ఫ్రెండ్లీ పేషెంట్ కేర్ వ్యవస్థలు మన వైద్య బృందాన్ని ఆశ్చర్యపరిచాయి.
ఆధార్ ఆధారిత ఓపీ సేవల ద్వారా రోగులకు తక్షణమే వైద్య సేవలు అందడంతో పాటు ముందస్తు అపాయింట్‌మెంట్ బుకింగ్, తొలి, తుది కన్సల్టేషన్ మధ్య రోగి ఆరోగ్యం మెరుగుదలలో స్పష్టమైన తేడాను గుర్తించటం వంటి అదనపు సౌకర్యాలు అక్కడ అమల్లో ఉన్నాయి. ఇక జిల్లా ఆసుపత్రుల్లో సూపర్-స్పెషాలిటీ సేవల కోసం ప్రత్యేక కౌంటర్లను, వివిధ విభాగాలను చేరుకునేందుకు రోగులకు మార్గనిర్దేశం చేయడానికి సంకేతాలతో కూడిన విజువల్ బ్రాండింగ్‌ను కేరళలో వినియోగిస్తున్నారు.
ఓపీ నమోదు చేసుకున్న వెంటనే రోగి సమాచారం డిజిటల్ స్క్రీన్‌లపై తక్షణమే కనిపించటంతో తమకు వెంటనే వైద్యం అందబోతుందని రోగులకు భరోసా లభిస్తోంది. ఇక స్థానిక పోలీస్ చెక్‌పోస్టులకు అనుసంధానితమైన ఇంటిగ్రేటెడ్ అంబులెన్స్ రియల్-టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ అత్యవసర వేళల్లో ఎంతో ఉపయోగకరంగా ఉందని గుర్తించారు. ఫైర్ సేఫ్టీ, సీసీ టీవీ మానిటరింగ్, సెక్యూరిటీ సర్వీసులు, రెడ్ అలారం సిస్టమ్ తదితర సేవల్లో కేరళ బెస్ట్ అని మన అధికారులు గుర్తించారు.