09-08-2025 12:00:00 AM
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం :
భారతదేశం వివిధ జాతుల సం స్కృతుల సమ్మిళితం. అద్భుతమైన మానవ సంబంధాలు ఈ దేశం సొంతం. ఇలాంటి భారతీయ సమాజం వెనుక పీడనలు, ఆకలి కేకలు, వివక్ష కూడా వున్నాయి. వీటన్నింటిని ఎదుర్కొనే భారతీయ సమాజాల్లో ఆదివాసీ సమా జం చాలా పెద్దది. ఆదివాసీ సమాజమం టే ఎవరో కాదు దేశ మూలవాసులు. దేశానికి అసలైన వారసులు వీరే. వీరు తరత రాలుగా వలసవాద దోపిడీకి గురవుతున్నారు.
ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆదివా సీలు కూడా తమ అస్తిత్వం కోసం, మనుగడ కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ, ఆ పోరాటాలు వ్యాపార శక్తుల ముందు పిపిలీకాలు. వ్యాపార శక్తులు ఇప్పటికే వేలాది ఎకరాల ఆదివాసీ భూభాగాన్ని కబళించాయి. అదేలా జరిగిదంటే.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్లలో ఆదివాసీలకు అనేక హక్కులు, చట్టాలు, స్వయం పాలనా అధికారాలు వచ్చాయి.
కాని, దురదృష్టవశాత్తు స్వార్థపూరిత రాజకీయ ప్రభుత్వాల వల్ల అవి నేటికీ అమలు కు నోచుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా రాజ్యాంగఫలాలు ఆదివాసీలకు అందలేదు. దేశంలో ఎలాం టి అభివృద్ధికి నోచుకోని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వారు ఆదివాసీలే. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండి, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన ప్రతి సందర్భంలోనూ ఆదివాసీలే నష్టపోతున్నారు.
ప్రాజెక్టుల పేరుతో, ఖనిజ తవ్వకాల పేరు తో ఆదివాసీలు నిర్వాసితులు అవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీ లు తమ మనుగడను కోల్పోవడమే కాక.. భాష, ఆచార సంప్రదాయాలు, పండుగలు, కట్టుబాట్లు, ప్రత్యేక జీవనశైలి విచ్ఛి న్నమవుతుంది. ఆత్మాభిమానం కోసం, మనుగడ కోసం, హక్కుల కోసం పోరాడటంతోనే ఆదివాసీల జీవితాలు తెల్లారిపో తున్నాయి.
మాకూ గుర్తింపు కావాలి..
స్వాతంత్య్రానికి ముందు విలసిల్లిన ఆదివాసీ సంస్కృతి.. స్వాతంత్య్రానంతరం మాత్రం ప్రాచుర్యం లేకుండాపోయింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. దీంతో వాటికి గుర్తింపు లేక అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితి ఒక భారతదేశంలోనే కాదు. ప్రపంచ దేశాల్లోనూ అలాగే ఉంది. ఆయా దేశాల్లో ఆది వాసీలు భారతదేశంలో అనుభవించినట్లే.. దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు.
ఆఫ్రికన్ దేశాల్లోనైతే భారతీయ ఆదివాసీల కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు భారత రాజ్యంగం, ఐక్యరాజ్యసమితి ఆదివాసీలకు అన్ని రకాల ప్రత్యేక గుర్తింపు ఇచ్చినా, ఆదివాసీలకు జరిగిన మేలేమీ లేదు. దేశంలో 10 కోట్లకు పైగా ఆదివాసీ జనాభా ఉంది. ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క ప్రభుత్వమైనా ఒక్క ఆదివాసి పండుగనైనా అధికారికంగా నిర్వహించలేదు.
ఆదివాసీలకంటే అల్పసంఖ్యాకులుగా ఉన్న వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన పండుగలను మాత్రం.. దేశంలో ముఖ్యమైన సాంస్కృతిక పండుగలంటూ వేడుకగా నిర్వహిస్తు న్నాయి. ఆదివాసీల పండుగలు, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. దీన్నిబట్టి మన దేశ పాలకులకు ఆదివాసీలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకెంతకాలం ఈ అణచివేత? భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్ వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మం త్రులుగా ఎన్నికవుతున్న ఆదివాసీ ప్రజాప్రతినిధులు.. గెలిచిన తర్వాత తాము కూడా ఆదివాసీలు అనే భావన కోల్పోతున్నారు. ప్రధానమైన రాజకీయ పార్టీలకు బానిసలుగా మారుతున్నారు. గిరిజనేతరులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన ప్రత్యేక చట్టా ల అమలు కోసం వారు ఏమాత్రం కృషి చేయడం లేదు. అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడిన దాఖలాలు లేవు.
అభివృద్ధి పేరుతో విధ్వంసం..
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకా రం.. ఆదివాసీ ప్రాంతంలోని భూమి, నీరు, అడవి, వాటిలోని వనరులు, ఖనిజ సంపద, ఫలసాయం అనుభవించే హక్కు పూర్తిగా ఆదివాసీలదే. కానీ, ఆదివాసీలకు అవి అందడం లేదు. అధికారుల లెక్కలేనితనం, లంచగొండి తనం వల్ల వాటిపై గిరి జనేతరుల పరమవవుతున్నాయి. ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా 5వ షెడ్యూల్ భూభాగంలోని భూమి, అడవి, నీరు, అక్క డి ఖనిజ సంపదను ప్రభుత్వ అధికారుల సహకారంతో రాజకీయ పార్టీల అండదండలతో గిరిజనేతరులు యథేచ్ఛగా దోచుకుపోతున్నారు.
భారీగా గనులు ఉం డే ప్రాంతాల్లో ప్రభుత్వాలే మల్టీనేషనల్ కంపెనీలకు ఆదివాసీ ఖనిజ సంపదను దోచిపెడుతున్నాయి. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేవాళ్లను రాజ్యం నక్సలైట్లు జాబితా, ఉగ్రవాదులు జాబితాలో చేర్చుతున్నది. రాజ్యాంగం పట్ల అంతఃకరణ శుద్ధితో, రాగ ద్వేషాలు లేకుండా నడచుకుంటానని ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి వరకు.. ఎవరైనా ఆదివాసీల సమస్యలను పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
‘అభివృద్ధి’ అనే పదం వింటే ఇప్పుడు ఆదివాసీలు వణికిపోతున్నారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, మల్టీ నేష నల్ కంపెనీలు చేపట్టే ప్రాజెక్టులు, ఖనిజా ల తవ్వకాలు, నేషనల్ పార్కుల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్లు.. ఇలా ఏ కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, చివరకు నష్టపోయేది ఆదివాసీలే కావడం బాధాకరం.
ప్రస్తుతం ఏపీలో చేపడుతున్న పోల వరం ప్రాజెక్టు కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాగే ఛతీస్‌గఢ్, ఒడిశా మొదలైన రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం మల్టీనేషనల్ కంపె నీలకు ధారాదత్తం చేస్తున్నది. బడా కంపెనీలు అక్కడ కూడా ఆదివాసీలను అడవు ల నుంచి బయటకు గెంటివేస్తున్నాయి.
హక్కుల పరిరక్షణ కోసం..
ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించడం, తమ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ కోసం పోరాటాలు మొద లైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వారి అస్తిత్వ ఉద్యమాలను పరిగణలో తీసుకున్నది. వారి ఉద్యమాలు, పోరాటాలు వాస్త వికవైనవని, హేతుబద్ధమైనవని గుర్తించింది. దీనిలో భాగంగానే 1994 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించింది.
ఆదివాసీల మనుగడపై దృష్టి సారించి వారి స్థితిగతులు, జీవన విధానా లు, జనాభా వివరాలు సేకరించి ఆదివాసీ హక్కులు, చట్టాలు, సంస్కృతి హరించిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. యేటా ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని సూచించింది. దీని లో భాగంగా భారతదేశంలో కూడా యే టా ఆగస్టు 9న ప్రతి ఆదివాసీ గూడెంలో విద్యావంతులు, చదువరులు, ఉద్యమకారులు ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తు న్నారు.
ఆదివాసీ హక్కుల చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఐక్యపోరాటాలకు పిలుపునిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా సదస్సులు జరుగనున్నాయి. ఇన్నాళ్లూ హక్కు ల సాధన గురించి తెలుసుకోలేని ఆదివాసీలు ఇకనైనా మేలు కోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం, మనుగడ కోసం పోరాటంలో పాల్గొనాలి. సరికొత్త ఆదివాసీ ఆత్మ గౌరవ పోరాటాలకు నాంది పలకాలి.
ఆదివాసీలు కేంద్ర, ప్రభుత్వాలను డిమాండ్ చేసే అంశాలు ఏమింటంటే.. ‘5వ షెడ్యూల్ ప్రాంతాల్లో 100 శాతం అన్ని రకాల ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకే ఇవ్వాలి. ఆదివాసీ సంస్కృతిని, చట్టాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనిం గ్, ఇతర వ్యాపారాలు స్థానిక ఆదివాసీలే నిర్వహించేలా అవకాశాలు కల్పించాలి’ అని కోరుతున్నాయి.
కుంజ శ్రీను
వ్యాసకర్త సెల్: 79950 36822