10-10-2025 12:00:00 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లో బైపాస్ సర్వీస్ రోడ్డులో వర్షపు నీరు నిలువ ఉండటంతో స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ అధికారులకు విన్నవించారు. గురువారం మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి నేషనల్ హైవే ఇంజనీర్ రమేష్, గ్రామ మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈసమస్యకు ప్రధాన కారణం, ఆరహదారుల పక్కన సరైన బాక్స్ డ్రెయిన్లు నిర్మించకపోవడం అని భావించబడుతోంది. స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు సరైన డ్రెయినేజ్ సౌకర్యం కల్పించకపోవడంతో వర్షపు నీరు ఎక్కువ సేపు నిల్వ ఉండి, ప్రజల ప్రయాణాలకు అంతరాయం కలుగు తోందని, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
మరో ప్రధాన సమస్య ఏమిటంటే, అవుషాపూర్ లో నిర్మించిన వాహన అండర్పాస్ క్రింద వేసిన రహదారి కూడా సరైన వంపు తగిన డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల నీరు నిల్వ ఉండి, రహదారి దెబ్బతింటోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల రాజశేఖర్ రెడ్డి, చీమల భానుయాదవ్, ఏనుగు మచ్చేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.