22-07-2025 05:03:32 PM
బీజేపీ ప్రజల పక్షాన నిలబడింది..
తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తాం..
బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలే మహేశ్వర్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజలను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డి పట్టా పొందారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJP Legislative Party Leader Alleti Maheshwar Reddy) స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడిందని, తెలంగాణ ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో జిమ్మిక్ తో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో విఫలమైందని, వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచనతోనే రైతుబంధు అమలు చేశారని ఆరోపించారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుబంధు ఇచ్చామని,సంబరాలు చేసుకుంటే సరిపోదు, యాసంగి డబ్బులు ఎవరు ఇయ్యాలే... ఇంకా నువ్వు రైతులకు బాకీ ఉన్నావని విమర్శించారు. నాలుగు ఎకరాల వరకే ఇచ్చావు మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తావనీ ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేందుకు మద్దతు ఇచ్చాం. మళ్లీ కొత్త ఆర్డినెన్స్ ఎందుకు, ఈ ఆర్డినెన్స్ లో ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు మోసపూరితమైనదని అన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఆర్డినెన్స్ ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలంగాణలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ తిరుగుతున్నాడని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రూ.175 వేల కోట్ల అప్పు తెచ్చి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని వస్తావ్, దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేస్తాం రాసి పెట్టుకో రేవంత్ అని సవాల్ విసిరారు. మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు భూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. పార్టీ పదవుల్లో ఎవడికి కావాలి.. పిల్లల్ని నేను కంటా పెంచి పోషించాల్సింది పక్కింటి వాడు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ తీరు.. అలాగే, రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, బండారు ప్రసాద్, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.