calender_icon.png 20 October, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెర్త్‌లో మనకే ఎర్త్

20-10-2025 01:44:52 AM

  1. వర్షంతో 26 ఓవర్లకే మ్యాచ్

నిరాశపరిచిన రోహిత్, కోహ్లీ

పేస్ పిచ్‌పై చేతులెత్తేసిన బ్యాటర్లు

పరువు నిలిపిన రాహుల్, అక్షర్ పటేల్

ఆసీస్‌కు 1 ఆధిక్యం

తొలి వన్డేలో భారత్ చిత్తు

పెర్త్, అక్టోబర్ 19: ఆస్ట్రేలియా టూర్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. భారీ అంచనాల మధ్య తొలిసారి కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. పేస్ పిచ్‌పై బ్యాటర్లు చేతులెత్తేయడం, పలుసార్లు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం, ఓవర్ల కుదింపు.. ఇలా పలు అంశాలు భారత్ ఓటమికి కారణమయ్యాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కన పెట్టి ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చింది. అలాగే హార్థిక్ పాండ్యా లేకపోవడంతో నితీష్ కుమార్‌రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. పిచ్ పరిస్థితి, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో తొలి ఓవర్ నుంచే ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు.

ఫలితంగా భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దాదాపు ఏడున్నర నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోకో ద్వయం ఫ్లాప్ అయింది. ఒక ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్టు కనిపించిన రోహిత్ శర్మ (8) త్వరగానే ఔటవగా... ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ కనీసం ఖాతా కూడా తెరవకుండా డకౌటయ్యాడు. కాసేపటికే గిల్ కూడా ఔటవగా... శ్రేయాస్ అయ్యర్ (11)కూడా ఫెయిలయ్యాడు.

అయితే వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తూ చికాకు పెట్టింది. ఫలితంగా మ్యాచ్ ఓవర్లను కుది స్తూ వచ్చారు. చివరికి 26 ఓవర్ల మ్యాచ్‌కు అవకాశం దొరికినా... అప్పటికి నిదానంగా ఆడడం భారత్ కొంపముంచింది. అంపైర్లు 26 ఓవర్లకు మ్యాచ్ డిసైడ్ చేసినప్పటకీ భారత్ స్కోర్ 57/2 (16.4 ఓవర్లు)గా ఉంది. 

తర్వాత 9.2 ఓవర్లలో భారత్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పో యింది. కేఎల్ రాహుల్(38),అక్షర్ పటేల్(31) రాణించడంతో స్కోర్ 100 దాటింది. చివర్లో నితీష్ కుమార్‌రెడ్డి (19) అలరించాడు. దీంతో భారత్ 26 ఓవర్లలో 136 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హ్యాజిల్‌వుడ్ (2/20), మిఛెల్ ఓవెన్ (2/20), కునేమన్ (2/26), స్టార్క్ (1/22) రాణించారు. డక్‌వర్త్‌లూయిస్ విధానం ప్రకారం ఆస్ట్రేలియా టార్గెట్‌ను 131 పరుగులుగా నిర్ణయించారు.

టార్గెట్ చిన్నదే కావడంతో కంగారూ లు స్వేచ్ఛగా ఆడారు. ఆరంభంలో హెడ్(8), షార్ట్(8) త్వరగానే ఔటైనప్పటకీ... మిఛెల్ మార్ష్ (46 నాటౌట్, 2 ఫోర్లు,3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా జోస్ ఫిలిప్ కూడా ధాటిగా ఆడడంతో విజయం కోసం ఆసీస్ పెద్దగా శ్రమించలేదు.

ఫిలిప్ 37 రన్స్‌కు ఔటైనా.. రెన్షా(21 నాటౌట్) ధా టిగా ఆడడంతో ఆసీస్ 21.1 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. భారత బౌలర్లలో అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/19) పర్వాలేదనిపించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగుతుంది.

స్కోర్లు :

భారత్ : 136/9 (26 ఓవర్లు) (కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31, నితీష్‌రెడ్డి 19 నాటౌట్ ;   హ్యాజిల్‌వుడ్ 2/20, మిఛెల్ ఓవెన్ 2/20,కునేమన్ 2/26 )

ఆస్ట్రేలియా 131/3 (21.1 ఓవర్లు)( మిఛెల్ మార్ష్ 46 నాటౌట్, ఫిలిప్ 37, రెన్షా 21; అర్షదీప్ 1/31, అక్షర్ పటేల్ 1/19)