23-08-2025 10:56:03 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): నిన్న మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు నీటితో ప్రవహిస్తున్నాయి. వాగు అవతల పక్కన పాలవాగు అనే వలస ఆదివాసి గిరిజనగూడెం ఉంది. ఆ వలస ఆదివాసి గూడెంలో వైద్య శిబిరం నిర్వహించాలని తలపెట్టిన వైద్య సిబ్బంది కాలినడకన రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వాగును దాటి ఆ గ్రామానికి చేరుకొని వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని స్థానిక మంగపేట ఆసుపత్రి పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
వైద్యాధికారి కృష్ణ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైద్య సిబ్బంది కాలినడకన వాగు దాటుకుంటూ వెళ్లి తిమ్మంపేట సబ్ సెంటర్ లోని వలస గిరిజన గ్రామం పాలవాగు లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు గుండాలపాడు, కొత్త గుండాలపాడు గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలైన పై గ్రామాలలో ప్రస్తుత సీజన్లో ముందు జాగ్రత్త చర్యగా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.ఈ మూడు గ్రామాలలో కలిపి 90 మందిని పరీక్షించి వైద్య చికిత్సలు అందజేశారు.12 మంది జ్వర పీడితులకు డెంగు, మలేరియా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ దీపక్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో అంటూ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, టైర్లు, చిన్న చిన్న డబ్బాలు వంటివి ఇంటి పరిసరాలలో నీటితో నిండి ఉంటే దోమ గుడ్లు పెట్టి ఆ నీటిలో లార్వాలు పెరిగి దోమలు వ్యాప్తి చెందుతాయని తద్వారా మలేరియా డెంగు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.