23-08-2025 11:03:43 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రానికి సమీపంలోని గొల్లగూడెం వంతెన వద్ద శనివారం ఉదయం ఆర్టీవో అధికారి పరుక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత దృష్ట్యా ఈ తనిఖీల్లో ముఖ్యంగా టాక్సీ వాహనాలను పరిశీలించారు. వాహనదారులు సమయానికి వాహన పన్నులు చెల్లించకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా నడపడం వంటి అంశాలను ఆయన గమనించారు.
ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ వాహనాలు నడపేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా సీటు బెల్టులు ధరించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడడం వంటి నియమాలను గుర్తు చేశారు. లైసెన్స్, వాహన పత్రాలు ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించరాదని, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరాన్ని ఆర్టీవో అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో పలు వాహనదారులకు నిబంధనలు ఉల్లంఘనపై జరిమానాలు విధించినట్లు సమాచారం.