calender_icon.png 10 August, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలి

09-08-2025 10:37:29 PM

మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం..

ములకలపల్లి (విజయక్రాంతి): ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం(District Secretary Mudda Bhiksham) పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ములకలపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ అధ్యక్షతన శనివారం ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని హక్కుల పరిరక్షణ దినంగా జరుపు కోవాలన్నారు. ఆగస్టు 9 న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నేడు ప్రజాస్వామ్యవాదులు ఆదివాసులు అందరూ హక్కుల పరిరక్షణ దినంగా జరుపుకోవాల్సిన  అవసరం ఎంతైనా ఉందని ఒకప్పుడు స్వతంత్రంగా స్వచ్ఛంగా అడవులను అనుభవిస్తూ జీవించిన ఆదివాసి ప్రజలు నేడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తిప్పి కొట్టాలని, ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసులందరూ తెలుసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను అడవి నుండి దూరం చేసే ప్రయత్నాలను మానుకోవాలని, అడవిలో నుండి దూరం చేసి వారి హక్కులను కాలరాసే ప్రభుత్వాల  దుర్మార్గాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు స్వతంత్రంగా, స్వేచ్ఛగా అడవులను అనుభవిస్తూ జీవించిన ఆదివాసీ ప్రజలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు భారత దేశాన్ని ఆక్రమించి అడవులను వశపరచుకోవడానికి ప్రయత్నించి నప్పుడు గిరిజనులు 75 సార్లు తిరుగుబాట్లు చేసి హక్కులు కాపాడు కున్నారని 1947 ఆగస్టు 15 న అనేక త్యాగాలతో సాధించుకొన్న స్వాతంత్రనంతరం ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి, రక్షణకు భారత ప్రభుత్వం అనేక పథకాలు,ప్రణాళికలు రూపొందించామని, గిరిజనుల కోసం వారి రక్షణ కోసం రాజ్యాంగంలో 5,6 షెడ్యూల్డ్ పొందుపరిచా మని,కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్నాయని వాస్తవానికి ఆదివాసీ,గిరిజనుల బ్రతుకులు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్య,వైద్యం,ఉద్యోగం, ఉపాధి రంగాల్లో, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడి అత్యంత దయనీయంగా వుండటం,హక్కులు హరించివేయబడుతుండటం బాధాకరమైన విషయం అన్నారు.

స్వాతంత్య్రానంతరం పరిస్థితుల్లో మార్పులు ఏమీ రాలేదని నేటికీ  ఆదివాసీ,గిరిజనుల ఉద్యమాలు  జరుగుతున్నాయని అభివృద్ధి పేరిట ఆదివాసీ గిరిజనుల జీవనాధారమైన అడవులను,పోడు భూములను,ఖనిజ సంపదను పెట్టుబడిదారీ వర్గాల లాభాల కోసం కొళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ ప్రయత్నాలను ఎదిరించి ప్రభుత్వాలపై  పోరాడాల్సిన అవసరం ఉందన్నారు సదస్సు అనంతరం పార్టీ కార్యాలయం నుండి మండల  ప్రధాన బస్టాండ్ సెంటర్ వరకు అరుణోదయ కళాకారులు భారీ ప్రదర్శన,ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్,జిల్లా నాయకులు కల్లూరు కిషోర్ మండల నాయకురాలు నూపా సరోజిని,నాయకులు ఎర్ర గొర్ల రామారావు,వెలకం చలమన్న, కురుసం ముఖేష్,పాయం రాజులు తదితరులు పాల్గొన్నారు.