15-09-2025 12:00:00 AM
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
చండూరు, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): కేంద్రంలో 3 వసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధానంపై సమరశీల ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు గట్టుపల్ మండల జనరల్ బాడీ సమావేశం అచ్చిని బీరప్ప అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కార్మిక వర్గ సమస్యలు పరిష్కరిస్తామని అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని కానీ 19 నెలలు గడిచిన ఏ ఒక్క రంగానికి చెందిన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు.
సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిల్లా నాయకులు వరికుప్పల ముత్యాలు వివిధ రంగాల యూనియన్ నాయకులు సుధాకర్, రాము, సైదులు, వేదావతి, భవాని, రాణి, నరసింహ,శంకరయ్య, నాయకులు నరసింహ, రబ్బాని, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.