calender_icon.png 11 May, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

10-05-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి అర్బన్, మే9: బెల్లంపల్లి మున్సిపాలిటీని పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డు, మున్సిపల్ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి రోజు వార్డులలోని ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, సేకరించిన వ్యర్ధాలలో ఉపయోగపడే వాటిని వేరు చేసి కంపోస్ట్ షెడ్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారీకి వినియోగించాలన్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని,  వార్డులలో నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని అధికారులకు సూచించారు.

అనంతరం మండల కేం ద్రం కన్నాలలో కొనసాగుతున్న అమృత్ 2.0లో భాగంగా నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. మిషన్ భగీరథ పథకం తో నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ప్రజలకు సరిపడా నీటిని అందించేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా నీటి ట్యాంక్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ నేపథ్యంలో ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగుల హాజరు పట్టిక, మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతి వివరాలను పరిశీలించారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు ఉన్నారు.