24-03-2025 01:29:44 AM
శ్రీరామనవమికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మాడవీధుల విస్తరణ పనులకు శ్రీకారం
భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 23 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్ 6, 7 తేదీలలో జరుగు శ్రీరామనవమి, మహా పట్టాభిషేకానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఏర్పాట్ల పై మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక శాసనసభ్యులు తేల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీరామనవమి ఏర్పాట్లకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులు, తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి శ్రీరామనవమికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండ వేడి అధికంగా ఉన్నందువలన భక్తులకు శ్రీరామనవమి పందిరిలో పాటు గుడి పరిసర ప్రాంతాలు చుట్టూ త్రాగునీటి ఏర్పాటు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులు కు అందించాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
వైద్య శాఖ సిబ్బంది అవసరమైన మందులు, అంబులెన్స్ ల ను సిద్ధంగా ఉంచాలని అవసరమైతే వేరే జిల్లాల నుండి అదనంగా సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ లో అనుభవజ్ఞులైన సిపిఆర్ నిపుణులను నియమించాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది అవసరమైన ఫైర్ ఇంజన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్సైజ్ అధికారులు ఉత్సవాల సమయంలో మద్యం షాపులు మూసి వేయించాలని ఆదేశించారు.
ఈసారి శ్రీరామనవమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజర వుతారని దానికి తగినట్లుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుం డా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా మాడవీధుల విస్తరణ పనులు
శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవు తారని మంత్రి తెలిపారు. మూడు రోజుల్లో మాడవీధుల విస్తరణకు అవసరమైన స్థల సమీకరణకు డబ్బులు చెల్లించి, శ్రీరామనవమి రోజున ముఖ్యమంత్రి చేతుల మీద గా మాడవీధుల విస్తరణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ సమీ క్షా సమావేశంలో ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,ఆర్డీవో దామోదర్ రావు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు