27 August, 2026 | 1:32 AM

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంతవరకు మా మద్దతు..

27-08-2026 12:00 AM

బీసీ ఉద్యమ నాయకులు వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి) : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంతవరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని బీసీ ఉద్యమ నాయకులు వట్టె జానయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించాలనే డిమాండ్తో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వస్తే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఈ ఉద్యమానికి బీసీ సంఘం తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం బుల్లెట్ ట్రైన్ కోసం జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జానయ్య యాదవ్ కోరారు.

అయితే సూర్యాపేట ప్రజల ప్రధాన సమస్యగా ఉన్న ఈ అంశంపై ఆయనకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నా రని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభం నాగరాజు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.