calender_icon.png 8 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ హక్కులకై రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం

08-10-2025 12:29:16 AM

  1. బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత కల్పించేంతవరకు ఉద్యమ కార్యాచరణ ఆగదు
  2. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు 

ఖైరతాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : బిసి రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించేంతవరకు ఉద్యమ కార్యాచరణ ఆగదని, బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బిసి ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ‘బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు - న్యాయ వివాదాలు పరిష్కారంపై బిసి సంఘాల సమాలోచన‘ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా బిసి జాతీయ కమిష న్ మాజీ చైర్మన్ జస్టిన్ వి.ఈశ్వరయ్య, బిసి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ టి.చిరంజీవులు, బిసి ఎస్సి, ఎస్టి జెఎసి చైర్మన్ డా.విశారదన్ మహారాజ్ బిసి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు. రాజ్యాధికారమే ధ్యేయంగా అన్ని బిసి కుల సం ఘాలను కలుపుకొని జెఎసిగా ఏర్పాటై, ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

బిసిల హక్కుల సాధనకు ఎంతవరకైనా పోరాడుతామని, తెలంగాణ ఉద్యమంకంటే బలమైన బిసి ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. బిసి బిల్లుపై పార్లమెంట్లో చర్చించాలని ఒక్క మాట అనలేదని మండిపడ్డారు. మండల కమిషన్ కు వ్యతిరేకంగా మండల ఉద్యమం నడిపిన నీచ చరిత్ర బిజెపి దని విమర్శించారు.

ఏ ఉద్యమం చేయకపోయినా ఆగమేఘాల మీద ఈడబ్ల్యూఎస్ బిల్లును ప్రవేశపెట్టి, నాలుగు రోజుల్లో అమలు చేసిన కేంద్రం మెజార్టీ వర్గమైన బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏదేమైనా బిసిల హక్కు లు సాధించేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బిసిపిఎఫ్ అధ్య క్షులు కుమార్ గౌడ్, ప్రధానకార్యదర్శి ప్రణీ ల్ చందర్, సర్పంచ్ల సంఘం జెఎసి చైర్మన్ యాదయ్యగౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్, బిసి సంఘాల నేతలు ఎన్. దుర్గయ్యగౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్టె విజయ్కుమార్ గౌడ్, ఆలిండియా ఒబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, కోలా జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.