13-08-2025 03:48:29 PM
నైపుణ్యం ఉంటే ఎక్కడైనా జీవించగలం
నిరుపేద విద్యార్థులు ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి
విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సొంత నిధులతో 100 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
మెరిట్ ఆధారంగా 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్య అందిస్తానని స్పష్టం చేశారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి, చదువుకోవడానికి స్థోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మహబూబ్ నగర్ నగరంలోని జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో 100 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించి, తన సొంత నిధులతో ఇంజనీరింగ్ విద్యను చదివించినున్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలని 18 నెలలుగా పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తున్నామని, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లా కళాశాలలను మంజూరు చేయించుకోవడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్శీస్సులతో మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాల సైతం మంజూరు కావడం జరిగిందన్నారు. మైనారిటీ విద్యార్థుల కోసం కూడా జికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ను ముఖ్యమంత్రి ని ఒప్పించి మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.
ప్రతి ఇంటి భవిష్యత్తు విద్యతోనే మారుతుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ప్రతి ఇంటి భవిష్యత్తు ఆ ఇంటిలో ఉన్న బిడ్డలు ఉన్నత విద్యలు చదివితేనే మార్చందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎడ్యుకేషనల్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ హబ్ గా అభివృద్ధి చేయాలని తాను తాపత్రయం పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైల్వేస్టేషన్ దగ్గర టాస్క్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని, ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు అమరరాజా బ్యాటరీ కంపెనీ వారితో మాట్లాడి ఈ మధ్యనే అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను దివిటిపల్లి లోని ఐటి పార్క్ ఆవరణలో ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.
మొదటి విడుతగా అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు మూడు కోర్సులను ప్రవేశపెట్టి, ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 200 మంది విద్యార్థులు అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి నైపుణ్య శిక్షణ పొందుతారని చెప్పారు. జికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రాబోయే నాలుగు ఐదు సంవత్సరాలలో వివిధ కోర్సుల్లో పదివేల మంది విద్యార్థుల వరకు చేరవచ్చని, అంతే కాకుండా పెద్ద ఎత్తున వివిధ పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు సైతం మన మహబూబ్ నగర్ నగరానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు ఇలాంటి సామాజిక కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.