calender_icon.png 21 May, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాల కోసం మున్సిపల్ సిబ్బంది ధర్నా

20-05-2025 04:37:14 PM

వేతనాలు వారంలోపు ఇవ్వకపోతే పనులు నిలిపివేస్తాం..

సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ కార్మికులు నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana Municipal Workers and Employees Union) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ... మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని,  కార్మికులకు నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించకపోతే ఏ విధంగా కుటుంబాలను వెల్లదీస్తారని ప్రశ్నించారు.

అధికారులు నిర్లక్ష్యం వెంటనే వీడి కార్మికులకు జనవరి నుండి చెల్లించాల్సిన వేతనాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రతినెలా అయిదో తారీకులోపు వేతనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. మానుకోట మున్సిపల్ కార్మికుల వేతనాలు ఈ నెల 26 వరకు ఇవ్వని పక్షంలో 27 నుండి పనులు నిలుపుదల చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం మేనేజర్ ఎం. శ్రీధర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, తోట శ్రీనివాస్, కాంపెల్లి శ్రీనివాస్, ఎర్ర శ్రీను, విజయ్, పుష్పరాజ్, చిరంజీవి, ఆవుల వీరన్న, సుజాత, లక్ష్మి, గడ్డం ఎల్లయ్య, వెంకన్న, అమృత, పద్మ తదితరులు పాల్గొన్నారు.