20-05-2025 05:24:08 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం కార్మికులను బదిలీలు చేసే విధానంలో నూతన పద్ధతులను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీ(INTUC) ఆధ్వర్యంలో చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం శాంతిఖనిలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు, నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గని ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్లో ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మిట్ట సూర్యనారాయణ(Deputy General Secretary Mitta Suryanarayana) మాట్లాడారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో నిమగ్నమై పనిచేస్తున్న కార్మికులను కొత్త బదిలీ విధానం కకా వికలం చేస్తుందన్నారు.
ప్రశాంతంగా ఉన్న సింగరేణిలో యాజమాన్యం బదిలీల పేరిట కొత్త విధానాలతో చిచ్చు రేపుతున్నదని విమర్శించారు. మూడు సంవత్సరాల వరకు కార్మికులు ఒకే చోట పని చేయాలనే విధానం సరికాదన్నారు. బదిలీ లేకుండా మూడు సంవత్సరాల వరకు ఒకే చోట ఉండాలనే నియమం కార్మికుల స్వేచ్ఛను దెబ్బతీసినట్లేనని పేర్కొన్నారు. బదిలీలు, కార్మికుల అవసరాలు, ఇష్టాఇష్టాలకు లోబడి ఉండాలన్నారు. ఇలా ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ బదిలీ పద్ధతులను రద్దు చేస్తూ కొత్తగా మూడు సంవత్సరాల వరకూ బదిలీలకు నిబంధనలు విధించడం ఏంటని ప్రశ్నించారు. బదిలీలలో కొత్త విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసలు బదిలీలలో నిబంధనలు విధించడం కార్మికులను నిర్బంధించడమే అవుతుందన్నారు.
ఈ విధానం కార్మికుల్లో అశాంతికి గురి చేయడంతో పాటు పరోక్షంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం గ్రహించాలని హెచ్చరించారు. పూర్వం నుండి బదిలీలకు ఒక విధానం అంటూ ఉండేది కాదని అన్నారు. కార్మికులను ఇబ్బందులకి గురిచేసే చర్యలకు అధికారులు పూనుకోవడం తగదన్నారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ ఏరియా సెక్రెటరీ కుక్కల ఓదెలు, నాయకులు కస్తూరి కనకయ్య, దేవ రమేష్, అనిల్ కుమార్, సదయ్య, రవికుమార్, వీరమల్లు, శ్యామ్, మాధవరెడ్డి, కుదిరె తిరుపతి, బత్తుల మొగిలి, సుమన్, వెంకటేష్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.