calender_icon.png 26 November, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ విచారణ ఏమైంది?

26-11-2025 12:00:00 AM

-రాష్ట్రంలో చెక్ డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయ్

- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాసిరకం చెక్ డ్యామ్ నిర్మాణం, అనేక చోట్ల ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, నిధుల చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు. చెక్ డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం బహిరంగలేఖ రాశారు.

రాష్ర్టంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం పేరుతో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు అనేక వార్తా కథనాలు, ఆరోపణలు వస్తున్నాయని, ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. నాసిరకం పనులతో నిర్మించడం వల్ల ఇప్పటికే చాలా చోట్ల చెక్ డ్యాంలు కూలిపోయాయని, తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల- వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైందని తెలిపారు.

2021లో వచ్చిన వరదల్లోనూ చాలావరకు కూలిపోయాయని, డిజైన్ లోపం, నాణ్యత సరిగ్గా లేని కారణంగా ప్రజాధనం నీటిపాలైందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెక్ డ్యామ్‌ల నిర్మాణం, నిధుల చెల్లింపుపై ఈ ఏడాది మే నెలలో మీరే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మానేరు నదిపై 57 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.287 కోట్లు చెల్లించిన దానిపై జరిపిస్తున్న విచారణ ఏమైందని ప్రశ్నించారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో చెక్ డ్యామ్ కాంట్రాక్టులను ప్రస్తుత కాంగ్రెస్ నాయకులే చేజిక్కించుకున్నారని ఆరరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్‌ఎస్ పాలకులు చెక్ డ్యామ్‌ల నిర్మాణ పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్‌లోని బడా నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఇసుక అక్రమ దందా చేస్తూ దోపిడీని దర్జాగా కొనసాగిస్తున్నారని విమర్శించారు.