ఆ సీస పద్యమేంది హరీశ్?

27-04-2024 02:32:45 AM

రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో ఉంటుంది కదా.. మరీ చాంతాడంత లేఖ ఏమిటి?.. ఇలా రాయమని మీ మామ చెప్పాడా?!

n ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు పట్టిన శని పోతుంది 

n పంద్రాగస్టు లోపు  రైతు రుణమాఫీ చేసి తీరుతాం 

n ఆయన తెలివి మొకాళ్ల నుంచి అరికాళ్లకు జారింది 

n హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం 

n ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 26(విజయక్రాంతి):  ‘ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల  రైతు రుణమాఫీ చేస్తాం. ఆలోగా బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖను రెడీ చేసుకోవాలి. ఆ  తేదీ  తర్వాత సిద్దిపేటకు ఆయన శని పోతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో  కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ అమరవీరుల  స్థూపం వద్దకు వెళ్లారు. రైతు రుణమాఫీ, మిగతా అంశాలను పేర్కొంటూ ఆయన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. హరీశ్‌రావు మోసానికి ముసుగుగా అమరవీరుల స్థూపాన్ని వాడుకుంటున్నారు.

చాంతాడంత  లేఖ రాయడమేమిటి? స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేకుంటే చెల్లుతుందా..? హరీశ్‌రావుకు మొకాళ్లలో ఉన్న తెలివి.. అరికాళ్లలోకి జారినట్లుంది.  మళ్లీ చెబుతున్నా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాం. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు..? రుణమాఫీకి రూ.30 నుంచి 40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్లు కంటే అది ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూ అక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?’ అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ కోసం అవసరమైతే ఒక సంవత్సరం కడుపు కట్టుకుని ఉంటామని ఆయన పేర్కొన్నారు.  

మోదీతో ఫైనల్ ఆట ఆడుతున్నాం 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  సెమీ ఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఫైనల్ ఆడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సెమీస్‌లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్‌ను ఓడించామని, ఇప్పుడు పాకిస్తాన్ జట్టులాంటి మోదీతో కొట్లాడుతున్నాని తెలిపారు. ఈ ఆటలో విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తంచేశారు. ‘బీజేపీ నేతలు అమిత్‌షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు.  ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి అంశాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం.. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. ఈ ఎన్నికలు దేశానికి  అవసరం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ 400 సీట్ల నినాదాన్ని ఎత్తుకున్నది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది’ సీఎం రేవంత్‌రెడ్డి  మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్‌కు రేవంత్ లేకపోతే చాలు 

‘కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని  కూల్చేయాలని చూస్తున్నారు. రేవంత్‌లేక పోతే చాలు.. ఎవరైనా పర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్‌ఎస్ నేతలు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదేలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకుని కూర్చీలోకి వచ్చామా? ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలి’ అని సోషల్ మీడియా కార్యకర్తలకు  సీఎం సూచించారు. రాష్ట్రంలోని 14 పార్లమెంట్  సీట్లలో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పోలింగ్ సమయంలో ముగిసే వరకు  ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఇప్పుడు  ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందన్నారు.