09-10-2025 01:15:02 AM
బీసీ రిజర్వేషన్లలో కీలకంగా మారిన వైనం
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో వాడి వేడిగా వాదనలు కొనసాగాయి. జీవో 9కి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసిన బుట్టెంబారి మాదవరెడ్డి, సముద్రాల రమేష్ తరఫున న్యాయవాదులు మయూర్‌రెడ్డి, బుచ్చిబాబులు వాదనలు వినిపించారు.
ట్రిపుల్ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన అంశాలను తెరమీదకు తీసుకురావడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో ట్రిపుల్ టెస్టు అంటే ఏమిటనేది చర్చగా మారింది. ట్రిపుల్ టెస్టులో మొదటిది రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం, రెండోది కమిషన్ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల వారిగా కేటాయించాల్సిన రిజర్వేషన్ల నిష్పత్తిని పేర్కొనడంతో పాటు లోపాలు తలెత్తకుండా చూడటం, మూడోది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చూడటం’ అని చెపుతున్నారు.
ఈ మూడు ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందని కోర్టులో ప్రభుత్వ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాసైందని చీఫ్ జస్టిస్.. ఏజీని ప్రశ్నించారు. ఆగస్టు 31న శాసనసభ, శాసన మండలిలో బిల్లు పాసైందని ఏజీ తెలిపారు. ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని ఏజీ సమాధానమిచ్చారు.
మొదటి టెస్టు
మొదటి టెస్టుకు సంబంధించి రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీల వెనుకబాటుతానికి గల కారణాలు (ఆర్థికం, విద్యా) పరిస్థితులకు సంబంధించిన అంశాలను, పూర్తి డేటా సేకరించడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసేందుకు డెడ్‌కేటెడ్ కమిషన్ వేసి పూర్తి డేటాను సేకరించింది.
రెండో టెస్టు
రెండోవ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో దామాషా ప్రతిపాదికన రిజర్వేషన్లు అందించే నిబంధన ఉంది. స్థానిక సంస్థలలో ఓబీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు అందించడానికి రిజర్వేషన్ కోసం స్వతంత్ర సంస్థ ద్వారా వెనుకుబాటుతనం గురించి, తలెత్తే చిక్కులపైన తెలియజేయాల్సి ఉంటుంది. ఆ కమిషన్ సమర్పించిన డేటా ఆధారంగా రిజర్వేషన్ శాతం నిర్ణయించాలి.
మూడో టెస్టు
ఎస్సీ, బీసీ, ఓబీసీల రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకూడదు. అయితే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను పెంచిన తర్వాత చాలా రాష్ట్రాలు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించాయి. ఈ జాబితాలో తమిళనాడు శాతం, చత్తీస్‌గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బీహర్‌లో 60 శాతం అమలవుతున్నాయి.
వీటితో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ 50 శాతం పరిమితిని దాటాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీల జనాభా లెక్కలు తేల్చాలనే డిమాండ్ ఉన్నది. దీంతో 50 శాతం పరిమితిని పున:పరిశీలించాలనే డిమాండ్ పెరుగుతోంది. కాగా, దేశ వ్యాప్తంగా, అనేక రాష్ట్రాల్లోని వివిధ సంఘాలు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతున్నాయి.