calender_icon.png 16 November, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలకు అడ్డేది?

15-11-2025 12:00:00 AM

  1. అక్రమాలకు అడ్డాగా మారుతున్న పలు కాలనీలు

కండ్లముందే నిర్మిస్తున్నా పట్టింపులేనితనం

సామాన్యుడిపై కాఠిన్యం...బడాబాబులపై కనికరం

ఇంద్రేశం మున్సిపాలిటీలో అధికారుల నిర్వాకం

సంగారెడ్డి, నవంబర్ 14(విజయక్రాంతి):ఇంద్రేశం మునిసిపాలిటీలో అక్రమ నిర్మాణాల బాగోతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సెట్ బ్యాక్ లేకుండానే జరుగుతున్న నిర్మాణాలతో పాటు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలో తీసుకున్న అనుమతుల ఆధారంగానే నిర్మాణాలు చేపడుతున్నామంటూ కొందరు వెల్లడిస్తుండగా, పాతభవనాల స్థానంలో రెన్యువేషన్ చేస్తున్నామంటూ మరికొందరు భవన యజమానులు వెల్లడిస్తున్నారు. అనుమతి పొందిన వాటికంటే మరికొందరు అదనంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇంద్రేశం మునిసిపాలిటీలో సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదని మునిసిపల్ అధికారులు వెల్లడిస్తున్నా.. ఇప్పటికే పదుల సంఖ్యలో సెల్లార్ నిర్మాణాలు పూర్తయిన భవనాలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలకే అనుమతులు తీసుకుని, ఒకటి లేదా రెండు షటర్లతో పాటు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో అధికారులు వారికి నచ్చిన వారికి మోదం తెలుపుతూ నచ్చని వారికి ఖేదం చేస్తున్నారు. సామాన్యుడు తన ఇంటికి నిర్మాణంలో ఏదైనా తప్పిదం చేస్తే ఆగమేఘాల మీద వచ్చి నానా రభస చేస్తుంటారు.

కానీ పీఎన్‌ఆర్ టౌన్ షిప్లో ఇష్టారీతిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా, పత్రికల్లో కథనాలు ప్రచురించినా చీమకుట్టినట్లు కావడం లేదని విమర్శిస్తున్నారు. సామాన్యులు ఇల్లు నిర్మించుకుంటే అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చే మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు వారికండ్ల ముందే అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

అధికారుల వైఖరిపై అనుమానాలు ?

ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీలలో, పీఎన్‌ఆర్ టౌన్ షిప్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా...మరికొన్ని పూర్తయినా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విజయక్రాంతి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించక పోవడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కార్యాలయానికే పరిమితమవుతూ తమను కలవడానికి వచ్చిన బిల్డర్లకు సహకరిస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జిల్లా టాస్క్‌పోర్స్‌కు లేఖ రాశాం..

ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అక్ర మ నిర్మాణాలపై గతంలోనే నోటీసులు జారీ చేశాం. అ యినా కొందరు నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఇలాం టి నిర్మాణాలను కూల్చివేసేందుకు జిల్లా టాస్క్ఫోర్స్కు అనుమతి కోసం లేఖ రాశాం. విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

మధుసూదన్‌రెడ్డి, కమిషనర్, ఇంద్రేశం మున్సిపాలిటీ