calender_icon.png 27 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురుచూపులేనా?

27-01-2026 12:00:00 AM

అసంపూర్తిగా బీజీ కొత్తూరు బీటీ రోడ్లు

రెండేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు

గుత్తేదారులు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తప్పని నరకయాతన

అశ్వాపురం, జనవరి 26 (విజయక్రాంతి): మొండికుంట గ్రామ పంచాయతి లోని , బీ.జి. కొత్తూరు గ్రామంలో నిర్మాణం చేపట్టిన రెండు బీ.టి. రోడ్లు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు మంజూరై శంఖుస్థాపనలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రోడ్డు పనులు పూర్తికాకపోవడం గుత్తేదారులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

63 లక్షల అంచనాతో మొదటి బీ.టి. రోడ్డు& ఇంకా అసంపూర్తే

మొదటి బీ.టి. రోడ్డు వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ), ఎస్.టి.ఎస్.డి.ఎఫ్ గ్రాంటు ఆధ్వర్యంలో సుమారు రూ.63 లక్షల అంచనా వ్యయంతో ఏబీ రోడ్డు నుంచి బీ.జి. కొత్తూరు గ్రామంలోకి వెళ్లే బీ.టి. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారిక శిలాఫలకం స్పష్టం చేస్తోంది. ఈ రోడ్డు పనులకు సంబంధించిన శంఖుస్థాపన తేదీ 11-04-2025గా నమోదు కాగా, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించి దాదాపు 10 నెలలు పూర్తవుతున్నప్పటికీ రోడ్డు పూర్తికాలేదు. దాదాపు సగానికి పైగా పనులు పూర్తి చేసి, మిగిలిన భాగాన్ని అర్ధాంతరంగా వదిలేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు త్రవ్వి మెటల్ పోసినప్పటికీ తారు వేయకపోవడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారి దుమ్ము, ధూళి గ్రామమంతా వ్యాపిస్తూ ఇండ్లలోకి, దుకాణాల్లోకి చేరుతోందని గ్రామ పంచాయితీ సర్పంచ్ మర్రి సంధ్య తెలిపారు.

దుమ్ముధూళితో ఆరోగ్య సమస్యలు

ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.150 లక్షల రెండో బీ.టి. రోడ్డు & నాలుగేళ్లైనా అదే పరిస్థితి

ఇక రెండవ బీ.టి. రోడ్డు విషయానికి వస్తే, గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో భద్రాచలం ఐటిడిఏ, ఎస్.టి.ఎస్.డి.ఎఫ్ గ్రాంటు ఆధ్వర్యంలో సుమారు రూ.150 లక్షల అంచనా వ్యయంతో బీ.జి. కొత్తూరు గ్రామం నుంచి నవోదయ స్కూల్ సైట్ వరకు బీ.టి. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు శిలాఫలకం పేర్కొంటోంది. ఈ రోడ్డు పనులకు సంబంధించిన శంఖుస్థాపన 2023 ఆగస్టు నెలలో అప్పటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా జరిగింది. అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోడ్డు పనులు కూడా పూర్తి కాకపోవడం కడు శోచనీయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, గుత్తేదారులు ఈ పనులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

రైతులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఈ రెండు బీ.టి. రోడ్లు గ్రామానికి ప్రధాన రహదారులుగా ఉండటంతో, అవి అధ్వాన్న స్థితిలో ఉండడం వల్ల రైతులు, కూలీలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, బీ.జి. కొత్తూరు నుంచి గొందిగూడెం, సీతారామ కెనాల్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ రోడ్లు పెద్ద ఆటంకంగా మారాయని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ఈ రోడ్లు ప్రధాన అడ్డంకిగా మారాయని వారు పేర్కొన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై ఏర్పడే గోతులు, బురద, మురికినీటితో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలి: సర్పంచ్ డిమాండ్

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన రెండు బీ.టి. రోడ్ల పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తిచేయాలని గ్రామ పంచాయితీ సర్పంచ్ మర్రి సంధ్య విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.