calender_icon.png 27 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాహా కార్యం.. చర్యలు శూన్యం!

27-01-2026 12:00:00 AM

  1. తుమ్మగూడెం గుట్టను తవ్వుకొస్తుండ్రు 
  2. 36.10 ఎకరాల విస్తీర్ణం 26కు తగ్గింది!                       
  3. పట్టపగలే పనులు
  4. అడ్డుకోని అధికారులు
  5. అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  6. ఆక్రమణను అడ్డుకోవాలని వేడుకోలు

మోతె, జనవరి 26 : రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుట్టను పట్టపగలే యథేచ్ఛగా తోముతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో చూస్తుండగానే ఎకరాల కొద్ది గుట్ట సాగు భూమిగా మారిపోతుంది. అధికారులు తెలిసి ఆపడంలేదా? మామూళ్ల మత్తులో మునిగిపో యారా అంటూ స్థానికంగా పెద్ద చర్చ సాగుతుంది.

వివరాల్లోకి వెళితే  మండల పరిధిలోని ఉర్లుగొండ రెవిన్యూ తుమ్మగూడెం గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 331లో 36.10 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి (గంగదేవిగుట్ట) ఉంది. కొందరు స్వార్ధపరుల కన్ను రహదారి పక్కనే ఉన్న ఈ గంగదేవిగుట్ట మీద పడింది. ఇంకేముంది అందినకాడికి ఆక్రమిస్తూ వస్తున్నారు.  వీరి స్వాహాకార్యం ఇలా కొనసాగుతున్న అధికారుల చర్యలు మాత్రం శూన్యం అయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.             

‘గుట్ట’క్కు స్వాహా

36.10 ఎకరాల మేర ఉన్న గంగదేవిగుట్టను చుట్టూ పొలాలు ఉన్న రైతులు సంవత్సరానికి కొంత కలుపుకుంటు వస్తున్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. వీరు చాలరన్నట్లు గ్రామంలోని సంబంధం లేని కొందరు ఇతర రైతులు, ఈ గ్రామానికి చెందిన ఒక్కరిద్దరి సహకారంతో ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేటకు చెందిన ఓ వ్యక్తి వచ్చి గుట్టను తవ్వుతున్నారని స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు. వీరందరూ కలిసి ఇప్పటికే 40 శాతం మేర గుట్టను స్వాహా చేసినట్లు తెలుస్తుంది.           

చర్యలు శూన్యం 

ఊరికి అతి సమీపంలో రహదారిని ఆనుకుని ఉన్న పెద్దగుట్టను అదే పనిగా కొందరు స్వార్ధపరులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న అధికారులు మాత్రం చూసికూడా చూడనట్లు వదిలేస్తున్నారు అనే ఆరోపణలు స్థానికుల నుండి వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకోకపోవడానికి అసలు కారణం ఏమిటో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

ఆంతర్యం అదేనా..?

రోడ్డుకు పక్కన గల గుట్టపై వాహనాలు పెట్టి బ్లాస్టింగ్ చేసి ఆక్రమిస్తున్న అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక రైతులే చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికారులకు ఆమ్యామ్యాలు అందడంతోనే వారు కావాలనే వధిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఇప్పటికే సుమారు పదుల ఎకరాల్లో గుట్ట ఆక్రమణకు గురి అయిన అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో దాని ఆంతర్యం అదేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.

ఆగని పనులు.. మేలుకోని అధికారులు! 

పట్టపగలు బ్లాస్టింగ్ లు చేయడంతో పాటు డోజర్లను పెట్టీ గుట్టను చదును చేస్తున్నారంటూ కొందరు రైతులు స్థానిక తాసిల్దార్ కు సమాచారం అందించగా ఆయన ఆదేశాల మేరకు కొందరు అధికారులు అక్కడకు వచ్చి మొక్కుబడిగా పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తుంది. అధికారులు బయటకు పనులు ఆపాలని, లోపాయకారిగా చేసుకోమని చెబుతున్నారనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అధికారులు పనులు ఆపేశామని చెబుతున్నా ఆక్రమణదారులు మాత్రం ఆపడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకుని గుట్ట ఆక్రమణకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.