27-01-2026 12:56:09 AM
అద్దెకు తీసుకునేందుకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులు..
శిథిలావస్థలో ఎంపీడీవో షాపింగ్ కాంప్లెక్స్..
తాండూరు, జనవరి 26 (విజయ క్రాంతి): లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పాలకుల నిర్లక్ష్యం..అధికారుల అలసత్వంతో శిథిలావస్థకు చేరింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో 20 లక్షల లక్షల జిల్లా పరిషత్ సాధారణ నిధులతో దుకాణ సముదాయాన్ని అన్ని హంగులతో నిర్మించి 2021 సంవత్సరంలో అప్పటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి మరియు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. ఐదు దుకాణాలకు అద్దెకిచ్చేందుకు గాను నిరుద్యోగుల వద్ద నుండి అధికారులు డీడీలు కూడా కట్టించుకున్నారు.
అద్దెదారులకు దుకాణాలను అప్పగించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారన్నా ఆరోపణలు వినవస్తున్నాయి. లక్షల రూపాయలు పోసి కట్టిన దుకాణ సముదాయం నాలుగేళ్లుగా నిరుద్యోగులకు ఇవ్వకపోగా ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా నెలనెల రావాల్సిన అద్దె రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణ సముదాయాన్ని నిరుద్యోగులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయమై పెద్దేముల్ ఎంపీడీవో రతన్ సింగ్ ను వివరణ కోరగా... గతంలో నిరుద్యోగులకు దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు టెండర్ వేయగా అభ్యంతరాలు రావడంతో నిలిపివేశామని.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.