calender_icon.png 27 January, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్టిఫికెట్ల ట్రబుల్ తీరింది.. ఇక జారీ షురూ!

27-01-2026 12:58:32 AM

  1. విజయక్రాంతి కథనానికి జీహెచ్‌ఎంసీ స్పందన
  2. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పునరుద్ధరణ
  3. 300 వార్డులు, 60 సర్కిళ్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత నెల రోజులుగా పౌరులను ముప్పుతిప్పలు పెడుతున్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సర్కిళ్ల పెంపుతో తలెత్తిన సాంకేతిక చిక్కులను అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు.

పౌరుల ఇబ్బందులను ఎత్తిచూపుతూ శనివారం విజయక్రాంతిలో ప్రచురితమైన సర్కిళ్లు డబుల్.. సర్టిఫికెట్లకు ట్రబుల్ అనే ప్రధాన కథనానికి జీహెచ్‌ఎంసీ యంత్రాంగం తక్షణమే స్పందించింది. పెండింగ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ మ్యాపింగ్‌ను  పూర్తి చేసి, సోమవారం నుంచే సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చింది.

సాంకేతిక చిక్కులు దూరం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ మార్పులకు అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థలో మ్యాపింగ్ జరగకపోవడంతో నెల రోజులుగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీనివల్ల పాస్‌పోర్టులు, వీసాలు, స్కూల్ అడ్మిషన్ల కోసం వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ‘విజయక్రాంతి’ ప్రముఖంగా ప్రచురించడంతో కదిలిన యంత్రాంగం.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ఆధ్వర్యంలో రేయింబవళ్లు పనిచేసి సాంకేతిక సమస్యను పరిష్కరించింది.

తాజాగా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు కొత్తగా ఏర్పాటైన 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్‌ను ఖచ్చితత్వంతో పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సర్కిళ్ల వారీగా మెడికల్ ఆఫీసర్ల లాగిన్ సమస్యలను సరిదిద్దారు. జనన, మరణ సాఫ్ట్‌వేర్ అప్లికేష న్‌నువిజయవంతంగా ప్రారంభించామని, ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు.

సర్వర్లు, లాగిన్ సమస్యలు పరిష్కారం అయినందున.. పౌరులు తమ సమీపంలోని ‘మీసేవా’ కేంద్రాల ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, సేవలను సద్వినియోగం చేసుకోవా లని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పేరుకుపోయిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.