calender_icon.png 27 January, 2026 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో‘సారీ’?

27-01-2026 01:45:09 AM

పీఆర్సీ కమిటీ గడువు మళ్లీ పొడిగించే యోచనలో సర్కారు!

  1. మార్చితో ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు
  2. నివేదికను తెప్పించుకునేందుకు ప్రభుత్వం విముఖత
  3. రిపోర్టు పూర్తయినా తీసుకునేందుకు ముందుకురాని సర్కారు
  4. ఇప్పటికే మూడుసార్లు పొడిగింపు గడువు పెంచకుండా పీఆర్సీ అమలు చేయాలంటున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదు రుచూస్తున్న పీఆర్సీ (వేతన సవరణ) అమ లు మరింత ఆలస్యం అయ్యేటట్లుంది. ఇప్పుడప్పుడే ప్రభుత్వం పీఆర్సీని అమలు చేసే పరిస్థితి కనిపించడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పీఆర్సీ కమిటీ గడువును పెంచనున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా తీపికబురు చెప్పకపోదా అని ఎదరుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లకు ఇది తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుందనే చెప్పాలి. ఆరు నెలల్లో అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ హామీ అటకెక్కింది. బీఆర్‌ఎస్ హయాం లో వేసిన కమిటీ గడువు ముగిసి సంవత్సరాలు గుడుస్తున్నా ప్రభుత్వం మాత్రం పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయని పరిస్థితి నెలకొంది.

నాలుగు నుంచి ఆరు నెలల గడువు

బీఆర్‌ఎస్ హయాంలో 2023 అక్టోబ ర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివ శంకర్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ బీ రామ య్య సభ్యుడిగా పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉం టుంది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రభు త్వం అమలు చేస్తోంది. అయితే 2024 ఏప్రిల్ 2తోనే ఆ కమిటీ గడువు ముగిసింది. అప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆ కమిటీ గడువు ను ఆరు నెలలు పొడిగించారు.

ఇలా ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచారు. ఈ ఏడాది మార్చితో మూడో సారి పెంచిన గడువు కూడా పూర్తవబోతోంది. మార్చి తర్వాత మరోసారి గడువును పెంచాలని ప్ర భుత్వం యోచిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మారోసారి కూడా పెంచితే ఇప్పటికే పీఆర్సీ కమిటీ గడువు పొడిగించి నాల్గుసార్లు అయినట్లే.

పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయ కుండా ఇలా గడువు పెంచుకుంటూ పోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవేళ పీఆ ర్సీ కమిటీ గడువు పెంచాలనుకుంటే నాలు గు నెలల నుంచి ఆరు నెలలు పెంచే అవకాశముంది. 

బడ్జెట్‌పైనే ఆశలన్నీ...

దసరా, సంక్రాంతి పండుగల వరకు ఎదురు చూసిన ఉద్యోగులు ఇక తమ ఆశలన్నీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పైనే పెట్టుకున్నారు. బడ్జెట్ అప్పుడు పీఆర్సీ గురించి శుభవార్త చెప్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. లేదంటే మరో ఆరు నెలలు వేచిచూడాల్సిందే. పీఆర్సీ కమిటీ నివేదికంతా సిద్ధమయ్యే ఉంది. దాన్ని ప్రభుత్వం తెప్పించుకొని అమలు చేయడమే మిగిలిఉంది. కానీ ప్రభుత్వం ఇదేం చేయడం లేదు.

కావాలనే ప్రభుత్వం చేయడంలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలువురు పేర్కొంటున్నారు. తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. రెండో పీఆర్సీని 2023 జూలై 1 నుంచి వర్తింపజే యాల్సి ఉంటుంది. కానీ ,గత ప్రభుత్వం 2023 అక్టోబర్ 2న వేసిన కమిటీనే ఇంత వరకూ నివేదికను సమర్పించనేలేదు.  రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కమిటీకు ప్రతిపాదినలు కూడా చేశారు. వచ్చిన ప్రతిపాదనలమేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను కూడా సిద్ధం చేసింది. అయితే, ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడిస్తారనేదే స్పష్టత లేదు. ప్రభుత్వం పిలుస్తే నివేదిక ఇచ్చేందుకు కమిటీ సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని తీసుకునేందుకు సుముఖత చూపించడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు పలువురు చెప్తున్నారు. 

భారం వద్దనేనా?

రాష్ట్ర ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువని ఇప్పటికే పలు వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పిన విషయం తెలిసిందే. పీఆర్సీ అమలుకు ఆర్థిక పరిస్థితే ఆటంకం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు డీఏలను ప్రకటించింది. దీనికితోడూ పీఆర్సీ అంటే ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ కనీసం 1 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రూ.250 నుంచి రూ.300 కోట్లు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అదే 51 శాతం ఫిట్‌మెంట్ అంటే రూ.12,750 కోట్లు భారం ప్రభుత్వంపై పడనుంది.

30 శాతం వరకు ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఒకవేళ 30 శాతమే ఇవ్వాలని నిర్ణయిస్తే రూ.7,500 కోట్లు అవుతుంది. రెండున్నరేండ్లు కావొస్తున్నా..పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాలు నేతలు చెప్తున్నారు. మరోవైపు పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటే దాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. అది అమలు చేయాలంటే నిధులుండాల్సిందే. ఈక్రమంలోనే ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుందనే విమర్శలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.