29-01-2026 12:54:42 AM
ఎర్రుపాలెం, జనవరి 28 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం మీద కొన్ని ఛానళ్లు పనిగట్టుకొని అనవసర వార్తలు ప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో పిచ్చి భ్రమలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి మధిరలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో లేనందున తాను మంత్రులను సమన్వయం చేస్తున్నానన్నారు.
ఇటీవల తాను, మంత్రులు కలిసి ఒకే కారులో వెళ్లడంపై ఓ ఛానల్ అనవసర ప్రచారం చేసిందని, తమ ప్రభుత్వంలోని మంత్రులు తమతో కాకపోతే వార్తలు రాసేవారితో, ప్రచారం చేసే వారితో కలిసి తిరగాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ మా అందరి లక్ష్యం అని తెలిపారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాన్ని ప్రజాభవనంలో చర్చించాం.
నిజాంబాద్ పార్లమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల సమస్య ఎదురైనందున అందుకు సంబంధించిన మంత్రులు నాతో సమావేశం అయ్యారు’ అని తెలి పారు. సింగరేణిలో టెండర్ల అంశంపై స్పష్టంగా పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రజలందరికీ వివరించామని, అయినా కొందరు అందులోనే తిరుగుతాను అంటే ఇక వాళ్ల కర్మ అని అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికస్థానాలు గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పట్టణ ఇన్‌చార్జిలు సమిష్టిగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే వారిని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించని గ్రూప్ వన్ పరీక్షను ప్రజా ప్రభుత్వం నిర్వహించడమే కాదు ఫలితాలు సైతం వెల్లడించి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
గ్రూప్ 2 సైతం పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రేర్, క్యూర్, ప్యూర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించిన అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకత్వంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.