06-11-2025 12:35:42 AM
చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.
కొత్తగూడెం నవంబర్ 5,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం పట్టణంలో గల గోధుమవాగు వంతెన గోతుల మయంగా మారింది. ఇది ఇరు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి. ఎన్నో రోజులుగా వంతెన మరమ్మత్తులు నోచుకోక,వన్వే గా మారింది. గోతులను మరమత్ చేయకుండా బోర్డులను అడ్డంపెట్టి వాహనాలను మళ్లించడం గమనారహం.
రోజుల తరబడి ఈ పరిస్థితి ఉన్నా సంబంధిత శాఖ అధికారులు , ప్రజాప్రతినిధులు చూస్తూ కాలం గడుపుతున్నారు తప్ప దానిపై దృష్టి సారించిన పాపాన పోలేదనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్య మంత్రి పర్యటన నేపథ్యంలో హడావుడిగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన మూన్నాళ్ళ ముచ్చటే అయింది. నిత్యం కొన్ని వందల వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు.
ఇంత రద్దీ కలిగిన రోడ్డు పై ప్రయాణిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న వారికి పట్టవా అంటూ విమర్శలు వెలబడుతున్నాయి. స్థానిక నాయకులు హడావుడి చేసి చేపట్టిన మరమ్మత్తులు నామమాత్రంగానే ఉన్నాయి. గోతుల్లో పడీ ప్రమాదాలు జరగకుండా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు తప్ప పటిష్టమైన మరమ్మత్తులు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వంతెన పై మరమతలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.