calender_icon.png 4 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చక్రధారి

28-07-2025 12:00:00 AM

పద్మవ్యూహచ్ఛేదనలో 

తానో అభిమన్యుడు 

గమ్యాన్ని చేరేందుకు నిరంతరం శ్రమించే చక్రధారి

కశ్మీరం నుండి కన్యాకుమారి దాకా

అలుపెరుగని చలన శీలి 

ఏం మోసుకు పోతాడో 

ఏం తీసుకు వస్తాడో కానీ

సంజీవనిని మోసిన 

హనుమంతుని తలపిస్తాడు

ప్రాణం, దేహం అంతా 

ఆ లారీయై బతుకీడుస్తాడు

తన ఘాడీ చక్రం గతి మీదే

దేశపు ఇరుసు తిరుగుతుంది

ఒక్క రోజు విశ్రమించినా

లోకం అల్లకల్లోలమై తీరుతుంది

నడిచే ఇంజను చప్పుడులో

దేశం గుండె అంతర్లీనంగా ధ్వనిస్తుంది

పండో, పంటో 

బొగ్గో, ఇటుకో 

పాలో, పెట్రోలో

వస్తువో, వస్త్రమో

ఖనిజమో, కాగితమో

ఇది అది అనేమిటి ?

సమస్త బతుకు అవసరాల్ని

అవలీలగా దరి చేర్చే సరంగు తను

తను కదిలితేనే 

నోటికింత అన్నం ముద్ద

తను చరిస్తేనే సమస్త 

విశ్వానికింత పూనిక

ఎండిన రొట్టెలు, ఉల్లిగడ్డలు

పచ్చడి మెతుకులే జీవ ఇంధనం

లారీ నీడే శయన మందిరం

నెలకో మూన్నెళ్ళకో 

ఇంటి సందర్శనం

కోపాలు, తాపాలు

ధర్నాలు, రాస్తారోకోలు 

హర్తాళ్ళు, బంద్‌లు

ఎన్నింటి మధ్య నలుగుతాడో

కరకు లాఠీల స్వార్థానికి 

ఎంతగా తల వంచుతాడో

టైరు కింద జీవం నలిగిందా ఊచల మధ్యే మగ్గడం

కాని కాలం దాపురించిందా ప్రాణాలే అర్పణం!

అయినా అతనాగడు

లోకాన్ని కొడిగట్టనీయడు