- ఏటా ఊరిస్తున్న నూతన సర్వేలు
- నిధుల విడుదలలో మాత్రం రిక్తహస్తమే
- దక్షిణాదిలో వెనకబడిన తెలంగాణ రైల్వే నెట్‌వర్క్
- నిధుల కేటాయింపుపై కేంద్రమంత్రులదే బాధ్యత
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణకు ఏటా రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు ఊహించిన మేర రావడం లేదు. 2016కు ముందు రైల్వే బడ్జెట్ ద్వారా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిపేది కేంద్రం. 2016 నుంచి కేంద్ర బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు చేస్తున్నారు. దీంతో ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రానికి ఏటా కొత్త రైల్వే ప్రాజెక్టులంటూ, సర్వేలంటూ ప్రకటిస్తున్న కేంద్రం వాస్తవంగా నిధుల కేటాయింపులో మాత్రం రిక్తహస్తమే చూపుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు రైల్వే నెట్‌వర్క్ ఎంతో వెనుకబడి ఉంది. అత్యధిక ఆదాయాన్నిచ్చే మన రాష్ట్రానికి రాష్ర్ట రైల్వే ప్రాజెక్టుల్లో తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ప్రస్తుతం తుది సర్వే మంజూరైన రైల్వే ప్రాజెక్టులు 30 ఉన్నాయి. అవి కార్యరూపం దాలిస్తే తెలంగాణలో రూ.83,543 కోట్లు రైల్వే పనులు ప్రారంభమవుతాయి. కానీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఏ మేరకు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.
దక్షిణాదిలో వెనుకబడిన రాష్ట్రం
దేశంలో 1,26,366 కి.మీ రైల్వే లైన్లున్నాయి. ఇందులో తెలంగాణలో ఉన్నది కేవలం 3,360 కి.మీ. మాత్రమే. ఏపీలో 7,714 కి.మీ నెట్‌వర్క్ ఉంది. తమిళనాడులో 6,836 కి.మీ, కర్ణాటకలో 6,083 కి.మీ. రైల్వే లైన్ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ (2,087) కంటే తెలంగాణ కొంత మెరుగు. కానీ ఆదాయంలో ముందుండే తెలంగాణకు కేంద్రం ఏటా రైల్వే కేటాయింపుల్లో అన్యాయమే చేస్తోంది. ఇక రైల్వే మంత్రుల అడ్డాగా పేరు పొందిన పశ్చిమ బెంగాల్‌లో 10,309 కి.మీ రైల్వే లైన్లు, మహారాష్ట్రలో 11,631 కి.మీ, ఉత్తరప్రదేశ్‌లో 16,001 కి.మీ లైన్లున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇంకా విస్తరణ జోరుగా సాగుతోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ సారైనా రాష్ట్రానికి నిధులు, కొత్త లైన్లు తెస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకైనా నిధులు ఇస్తారని రాష్ట్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
రైళ్లు ఎరుగని జిల్లాలు
భద్రాచలం, మేడారం, రామప్ప దేవాలయం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు, వెనక బడిన జిల్లాలైన వనపర్తి, సూర్యాపేట, నాగర్ కర్నూల్‌తోపాటు కొడంగల్, పరిగి, నారా యణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ వంటి వెనకబడిన ప్రాంతాలు, నిర్మల్, ఇచ్చో డ వంటి అటవీ ప్రాంతాలకు ఇప్పటివరకు రైల్వే అనుసంధానమే లేదు. రాష్ర్టంలోని అన్ని జిల్లాలో లక్షపైన జనాభా ఉన్న అన్ని పట్టణాలనూ రైలు మార్గంతో అనుసంధామిస్తామంటూ కేంద్రం ప్రకటన చేసింది. కానీ అది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఆవిర్భవించాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్ లొకేషన్ సర్వే ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టుల సంఖ్య పదేళ్లతో పోలిస్తే పెరిగింది. అంతకుముందు పదేళ్లలో రూ.10,912 కోట్ల విలువైన 5 ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టులే మం జూరు కాగా నిధుల కేటాయింపు పెరుగుతున్నా రాష్ర్ట అవసరాలతో పోలిస్తే చాలా తక్కువే.
నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు
- మహబూబ్‌నగర్ మునీరాబాద్ మధ్య 246 కి.మీ రైలుమార్గం 1997 మంజూరైంది. మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, మరికల్, జక్లేరు, మక్తల్, మాగనూరు, కృష్ణా రైల్వేస్టేషన్ల వరకు పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు కృష్ణా మీదుగా రాయచూరు వరకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తు న్నాయి. మునీరాబాద్ నుంచి రాయచూ రు మధ్య జరుగుతున్న పనుల్లో భా గం గా ఇప్పటివరకు సింధనూరు వరకు ప నులు పూర్తయ్యాయి. సింధనూరు,- రాయచూరు మధ్య పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, రాయచూరు, మాన్వి, సింధనూరు మీదు గా హుబ్లీ, గోవా చేరుకునేందుకు దగ్గరి మార్గం అందుబాటులోకి వస్తుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయి ంపు భారీగా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ లైన్ అందుబాటులోకి వస్తుంది.
- గద్వాల డోర్నకల్ రైల్వే లైన్ 296 కి.మీ మేర సర్వే కొనసాగుతోంది. అందుకోసం రూ.7.40 కోట్లు కేటాయించారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, దేవరకొండకు తొలిసారిగా రైల్వే సౌకర్యం కల్పించే మార్గమిది. రూ.5,330కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాను నేరుగా తెలంగాణ మీదుగా ఏపీలోని విజయవాడ, గుంటూరును సైతం అనుసంధానించే ప్రాజెక్టు ఇది.
- రీజినల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగ్ రైల్ లైన్‌ను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫైనల్ సర్వే మంజూరు చేసి దానికి రూ.14 కోట్ల నిధులు కేటాయించింది. కానీ ఇప్పటివరకు సర్వే మొదలుకాలేదు. నిధుల్లోంచి పైసా ఖర్చు చేయలేదు. 564 కి.మీ ప్రతిపాదిత రైలు మార్గం ప్రాథమిక వ్యయం అంచనా రూ.12,408 కోట్లు.
- ఆదిలాబాద్, నిర్మల్, పటాన్‌చెరు 317 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.5,706 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
- 2010 జూన్‌లో వికారాబాద్‌పూ -కృష్ణా వయా వరంగల్ 122 కి.మీ మేర కొత్త రైలు మార్గం ప్రాజెక్టకు సర్వే మంజూరైంది. దీని నిర్మాణానికి రూ.787 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2012 మార్చిలో రైల్వేబోర్డుకు నివేదిక ఇచ్చారు. 2023 సెప్టెంబరు 8న తుది సర్వే మంజూరైంది. అప్పుడు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.2,196 కోట్ల కు చేరింది. తుది సర్వే మంజూరై 9 నెల లు దాటినా పనులు ప్రారంభం కాలేదు.
- ఉందానగర్ (హైదరాబాద్) -విజయవాడ సెమీ హైస్పీడ్ కారిడార్ సర్వేకు రైల్వేబోర్డు గతేడాది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే గంటకు 220 కి.మీ. గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పెట్ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్) సర్వే సంవత్సర కాలంగా జరుగుతోంది. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ -విజయవాడ వెళ్లడానికి సమయం తక్కువ పడుతుంది.
- కరీంనగర్ -హసన్‌పర్తి 62 కి.మీ. కొత్త రైలు మార్గం కోసం సర్వే 2011లో మంజూరైతే దాని నివేదిక 2013లో రైల్వేబోర్డుకు చేరింది. అప్పుడు అంచనా వ్యయం రూ.464 కోట్లు కాగా ఇప్పుడు రూ.1,116 కోట్లకు చేరింది.
- దిల్లీ, విజయవాడ వైపు వెళ్లే రైళ్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ -కాజీపేట మార్గం లో ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి. 85.48 కి.మీ. మేర మూడో లైను నిర్మిస్తే ప్రయాణీకుల రాకపోకలు సులభమై రైళ్ల వేగం పెరుగుతుంది. ప్రయాణ సమ యం తగ్గుతుంది. మూడో లైనుకు 2014 లో సర్వే మంజూరైతే 2018లో రైల్వేబోర్డుకు ప్రాథమిక సర్వే నివేదిక వెళ్లింది.
- భూపాలపల్లి కాజీపేట కొత్త లైన్ 64 కి.మీ ప్రాజెక్టుకు రూ.1,152 కోట్ల అం చనా వ్యయంతో రూపొందిస్తుందన్నా రు. ఇది సమ్మక్క- సారక్క భక్తులకు ఉపయోగపడుతుంది.
- నగరంలో 2014కు ముందు అద్భుతంగా ఉన్న ఎంఎంటీఎస్ రైల్వే వ్యవ స్థను ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్తం చేసేసింది. వేళాపాల లేకుండా రైళ్లు తిరుగుతున్నాయి. కొత్త లైన్లు వేశామని చెప్తున్నా ఎంఎంటీఎస్ రైళ్లను సగానికి పైగా రద్దు చేశారు. రూ.5 కనీస చార్జితో ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్ రైళ్లపై నగర వాసులు ఆధారప డతారు. ఈ రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ట్రాఫిక్ కష్టాలకు కొంతైనా చెక్ చెప్పవచ్చు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి కొత్త రైళ్లు మంజూరు చేస్తే బాగుంటుంది.