calender_icon.png 15 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్‌రూంల పంపిణీ ఎప్పుడో..?

15-07-2025 12:00:00 AM

- మూడుసార్లు వాయిదా వేసిన అధికారులు

- అయోమయంలో లబ్ధిదారులు

జహీరాబాద్, జూలై 14 : ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించింది. కానీ అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయకుండా నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తోంది. తమకు గూడు సొంతమవుతుందని ఎంతో సంతోషించినప్పటికీ వారి ఆశలపై నీళ్ళు చల్లుతూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో సీఐటీయు ఆధ్వర్యంలో లబ్దిదారులు కలిసి ఆర్డీవో కార్యాలయం ముట్టడించడంతో ఈనెల 12వ తేదీన ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతామని హామీనిచ్చారు.

అయినప్పటికీ పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడంతో లబ్దిదారులు లబోదిబోమంటు న్నారు. ఏళ్ళ తరబడి సొంత ఇల్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ నానా ఇబ్బందులకు గురవుతున్నామని, వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఎప్పుడు మోక్షం వస్తుందోనని, వాటి  పంపిణీ ఎప్పుడు చేస్తారోనని ఎదురు చూడడం లబ్దిదారుల వంతవుతుంది. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో 660 డబుల్ బెడ్ రూంలను నిర్మించారు. నిర్మాణం చేపట్టినా పంపిణీ చేయక పోవడంతో దిష్టిబొమ్మలా కొట్టుమిట్టాడుతున్నాయి.

పట్టణంలో రెండు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూంలను నిర్మించారు. అల్లోల్ రోడ్డుకు వెళ్లే దారిలో రహమత్ నగర్ వద్ద డబుల్ బెడ్ రూమ్ లను పేదలకు పంపిణీ చేశారు. అలాగే కోతి వెళ్లే దారిలో గల 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదు. 640 లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ వారికి ఇళ్లను అప్పగించడంలో అధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నారు.

అల్గోల్ వద్ద  పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు హాయిగా జీవితం గడుపుతుండగా కోతి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ప్రభుత్వాలు మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి తేదీలు ప్రకటిస్తున్నారే తప్ప లబ్దిదారులకు అందించడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగించాలనికోరుతున్నారు.