06-08-2025 01:52:59 AM
* వారు అందరిలాగా ప్రభుత్వ ఉద్యోగులే. కానీ జీతాల విషయానికొస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారిని వేరుగా చూస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ ఒక విధానం.. మోడల్ స్కూల్ టీచ ర్లకు మాత్రం మరో విధానం.. అవును ఇది నిజమే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు పడితే రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు మాత్రం జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు.
జీతాలు తమ ఖాతాల్లో ఏ తేదీనా జమ అవుతాయనేది వారికి తెలియదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లాగా మోడల్ స్కూల్ టీచర్లు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ వాళ్ల లాగా వీరికి సమయానికి వేతనాలు పడడంలేదు. జూలై నెల జీతం ఇప్పటివరకు ఇంకా అందనేలేదు.
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2,800 మంది వరకు టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ప్రిన్సిపాళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు. వీరంతా ఇతర ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల తరహాలో రెగ్యులర్ ఉద్యోగులే. ఈ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీ ష్ అందుతోంది.
అప్పటి యూపీఏ ప్రభుత్వంలో 2013లో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. 2013 నుంచి ఇప్పటివరకు ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు టైంకి అందడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 10 నుంచి 15వ తేదీ వరకు జీతాలు జమవుతున్నాయి. ఒక్కో సారి 20వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. గత పన్నేండేళ్ల నుంచి ఇదే తంతు.
రాఖీ పండక్కైనా అందుతాయా!..
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తున్నామన్న సర్కారు హామీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు అమలుకు నోచుకోవడంలేదు. ఈ నెలలో అసలే హాలిడేలు, పండగలు ఎక్కువగా ఉన్నాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు ఆప్షనల్ హాలిడే. 9వ తేదీన రెండో శనివారం, రాఖీ పండగ ఉంది. ఇది ఎంతో ప్రత్యేకం. ఈ రోజు ఎన్నో అవసరాలు, ఖర్చులు ఉంటాయి. ఇక ఈనెల 10న ఆదివారం. ఒకవేళ వేతనాలు ఇవ్వాల్సి వస్తే నేడు లేదా రేపు ఇవ్వాల్సి ఉంటుంది.
లేదంటే ఈనెల 11 నుంచి 15లోపు తర్వాతనే. అప్పుడు కూడా కుదరకుంటే ఇక 20 వరకు వేచి చూడాల్సిందే. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి ఉంది. ఇలా ఈనెలలో పండుగలుండటంతో కుటుంబ అవసరాల కోసం వేతనాలు వస్తాయో లేదోనని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు సరైన వేళకు రాక.. బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక, చెక్‌బౌన్స్ అయి, సిబిల్ స్కోర్ పడిపోయి మోడల్ స్కూళ్ల టీచర్లు అవస్థలు పడుతున్నారు.
సెప్టెంబర్‌లో ఉద్యమం చేస్తాం
ఇతర ఉపాధ్యాయులు, అధ్యాపకుల తరహాలో మేము రెగ్యులర్ ఉపాధ్యాయులమైనా ఇప్పటివరకు మాకు వేతనాలు అందలేదు. 2013 నుంచి సమయానికి వేతనాలు అందడంలేదు. ఈఎంఐలు కట్టలేక 90 శాతం మంది ఉపాధ్యాయుల సిబిల్ స్కోర్ పడిపోయింది. బ్యాంకులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలేదు. రుణాలు ఇస్తలేరు.
మా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 010 పద్దు కింద తమను చేర్చి ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇలా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఒక్క రూపాయి కూడా మాకు ఎక్కువ రాదు. ఏపీలో మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వారికి ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నారు. మనదగ్గర కూడా మెర్జ్ చేయాలి. లేదంటే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సెప్టెంబర్‌లో ఉద్యమానికి సిద్ధమవుతాం.
బీ.కొండయ్య, టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు